ఫ్రాన్స్ దేశంలో ‘ఫెటే డి లా మ్యూజిక్’ ఉత్సవంలో దారుణం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, అంతర్జాతీయ పర్యాటకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అయితే ఈ మ్యూజిక్ ఫెస్ట్ వల్ల ఫ్రాన్స్‌లో రాత్రికి రాత్రే అల్లర్లు, అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయి. ముఖ్యంగా రాజధాని పారిస్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో హింస చెలరేగడంతో ఫ్రెంచ్ భద్రతా దళాలు రంగంలోకి దిగి రాత్రంతా శ్రమించి దాదాపు 243 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఉత్సవంలో ‘నీడిల్ స్పైకింగ్’ ఎక్కువగా జరిగింది. రద్దీగా ఉన్న ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు మహిళలపై సిరంజిలతో అకస్మాత్తుగా దాడులు చేశారు. బౌలేవార్డ్ డి లా మాడెలీన్ అనే ప్రాంతంలో ఓ మహిళకు ఇలా సిరంజితో గుచ్చిన కొద్దిసేపటికే ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ సిరంజిల ద్వారా బాధితుల శరీరంలోకి ఏవైనా ప్రమాదకర మత్తు పదార్థాలను ఇంజెక్ట్ చేశారా లేదా అనే కోణంలో ల్యాబ్ పరీక్షలు జరుపుతున్నారు.

ఈ సంగీత ఉత్సవం కేవలం అల్లర్లకే పరిమితం కాలేదు. వేడుకల ముసుగులో కొందరు మహిళలపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కొందరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇరుకైన వీధుల్లో వేర్వేరు ముఠాల మధ్య గొడవలు జరిగి కత్తిపోట్లు కూడా చోటుచేసుకున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేతులు దాటిపోవడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం వేలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు నిఘా డ్రోన్లు, హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అయినా కూడా పెద్ద ఎత్తున హింస జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని పలువురు అంటున్నారు.

ఫెటే డి లా మ్యూజిక్‌ను ఫ్రాన్స్ వ్యాప్తంగా జరుపుకునే సంగీత ఉత్సవం. దీనిని సాధారణంగా వరల్డ్ మ్యూజిక్ డే లేదా ప్రపంచ సంగీత దినోత్సవం అని పిలుస్తారు. ఈ వేడుకను మొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ ఉత్సవం ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహిస్తారు. అంటే ఏడాదిలో పగలు ఎక్కువ సమయం ఉండే రోజున జరుగుతుంది. సంగీతాన్ని కులమతాలకు, ధనిక పేద బేధాలకు అతీతంగా ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున ఎవరైనా సరే.. రోడ్ల పక్కన, పార్కుల్లో, కేఫ్‌లలో, రైల్వే స్టేషన్లలో, వీధుల్లో ఎక్కడైనా సరే ఉచితంగా లైవ్ మ్యూజిక్ షోలు, కచేరీలు నిర్వహించుకోవచ్చు. ఈ మ్యూజిక్ ఫెస్ట్‌లో ప్రొఫెషనల్ సింగర్స్ నుండి కొత్తగా నేర్చుకునే వారు కూడా తమ టాలెంట్‌ను నిరూపించుకోవచ్చు.