మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్న బిజినెస్‌మ్యాన్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నో ప్లాన్‌లు వేసి సియా గోయల్ కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేతన్ హత్య కోసం సియా ప్లాన్ A,B,C వేసింది. ఇవి సక్సెస్ కాకపోవడంతో ప్లాన్ డి వేయగా.. అది వర్కవుట్ అయ్యింది. పూణేకు చెందిన 26 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ చనిపోతే పోలీసులు మొదట యాక్సిడెంట్‌గా భావించారు. కానీ విచారణ జరిపిన తర్వాత పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు గుర్తించారు. ఎలాగైనా కేతన్‌ను వదిలించుకోవాలని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి వరుసగా ఐదు ప్లాన్‌లు వేశారు. మొదటి మూడు ప్లాన్‌లు విఫలం కాగా.. నాలుగోవ ప్లాన్‌లో కేతన్‌ను హత్య చేశారు. ఈ ప్లాన్ కూడా మిస్ అయితే మరో ప్లాన్‌లో చంపేద్దామని ప్లాన్ E కూడా ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నారు.

Also Read : నల్గొండ మర్డర్ మిస్టరీ..ఆ నలుగురిని చంపిందేవరు?

Shocking Details In The Ketan Murder Case

కేతన్ అగర్వాల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సియా గోయల్‌తో నిశ్చితార్థం అయింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె గత కొంతకాలంగా చేతన్ చౌదరి అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా సియా, చేతన్ ఇద్దరూ దాదాపు 2,000 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. కేతన్ ఆస్తిని దక్కించుకుంటూనే.. ప్రియుడితో కలిసి జీవించడం కోసం సియా ఈ హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే ముందుగా ప్లాన్ చేసి, కేతన్ బాలి ట్రిప్‌కు వెళ్లకుండా విమానాశ్రయంలో అతని పాస్‌పోర్ట్‌ను మాయం చేసింది.

ప్లాన్ ఏలో భాగంగా మే 31న సియా, కేతన్ ఇద్దరూ కలిసి లోహగడ్ కోటకు వెళ్లారు. ఆ రోజే అతడిని లోయలోకి తోసేయాలని సియా అనుకుంది. కానీ అనుకూలమైన సమయం దొరక్కపోవడంతో ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత జూన్ 4న కేతన్‌ను మళ్లీ ఎలాగైనా కోటకు తీసుకువెళ్లి చంపాలని ప్లాన్ బి వేసింది. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో కేతన్ ఆ రోజు కోటకు వెళ్లలేదు. ఇక జూన్ 14న ప్లాన్ సిలో భాగంగా.. సియా, కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకువెళ్లి అక్కడ కొండపై నుంచి లోయలోకి తోసేసింది. కానీ కేతన్ అదృష్టవశాత్తూ ఒక చెట్టును గట్టిగా పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో సియా భయపడిపోయి.. అక్కడ పాము ఉంది. అందుకే నిన్ను కాపాడటానికి తోసేశానని అబద్ధం చెప్పి నమ్మించింది.

చివరికి ప్లాన్ డి జూన్ 19న సియా పుట్టినరోజును సాకుగా తీసుకుని.. కేతన్‌కు ఒక సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి మళ్లీ లోహగడ్ కోటకు రప్పించింది. ఈసారి సియా ప్రియుడు చేతన్ చౌదరి కూడా అక్కడికి వచ్చాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చేతన్ తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి, 35 డిగ్రీల ఎండలో హూడీ ధరించి ముఖం దాచుకుంటూ కోట వైపు నడిచాడు. కేతన్ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో సియా అతడిని లోతైన లోయలోకి తోసేసింది. ఈ ప్రమాదంలో కేతన్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత సియానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి.. కేతన్ కాలు జారి పడిపోయాడని డ్రామా ఆడింది. ఒకవేళ ఈ లోహగడ్ కోట వద్ద ప్లాన్ డి గనుక విఫలమైతే.. మహాబలేశ్వర్‌లోని రిసార్ట్‌లో కేతన్‌ను చంపేందుకు ప్లాన్ E కూడా రెడీ చేసుకుంది.

కేతన్‌కు ట్రెక్కింగ్‌లో మంచి అనుభవం ఉంది. అంత సులువుగా అతను కాలు జారి పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానించారు. పైగా కేతన్ అంత్యక్రియల సమయంలో సియా ప్రవర్తన చాలా వింతగా అనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సియా, చేతన్‌ల కాల్ డేటాను పరిశీలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : రాధాగాయత్రి కేసులో బిగ్ ట్విస్ట్… శ్రీచరణ్ పై హత్యకేసు నమోదు