keir starmer

BIG BREAKING :  బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి పెను భూకంపం సంభవించింది. లేబర్ పార్టీ నుంచే తీవ్ర ఒత్తిడి రావడంతో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. స్టార్మర్ అధికారికంగా ప్రకటించడానికి ఒక్క రోజు ముందే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రాజీనామాను ఖచ్చితంగా ఊహించి చెప్పారు.

ఆదివారం నాడే డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో ఒక సంచలన పోస్ట్ చేశారు. కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నారు. వలసలు, ఎనర్జీ వంటి రెండు అత్యంత కీలకమైన విషయాల్లో ఆయన ఘోరంగా విఫలమయ్యారు అంటూ ట్రంప్ రాసుకొచ్చారు.

ట్రంప్ ఈ పోస్ట్ చేసిన సమయంలో బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు దీన్ని కేవలం అంచనా గానే కొట్టిపారేశాయి. ట్రంప్‌కు బ్రిటన్ ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక సమాచారం వెళ్ళలేదని, స్టార్మర్‌తో ఆయన మాట్లాడలేదని కూడా అధికారులు చెప్పారు. కానీ, కట్ చేస్తే సరిగ్గా 24 గంటలు తిరగకముందే స్టార్మర్ తన రాజీనామాను ప్రకటిస్తూ 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ప్రసంగించారు. దీంతో ట్రంప్ చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది.

2024 జులైలో లేబర్ పార్టీని భారీ విజయంతో అధికారంలోకి తెచ్చినప్పటికీ, గత రెండేళ్లలో స్టార్మర్ పాపులారిటీ దారుణంగా పడిపోయింది. ఆర్థిక వృద్ధిని పెంచడంలో, ప్రజా సేవలను మెరుగుపరచడంలో ఆయన విఫలమయ్యారంటూ లేబర్ పార్టీ ఎంపీలే తిరుగుబాటు చేశారు. లేబర్ పార్టీలోనే స్టార్మర్ ప్రత్యర్థి అయిన ఆండీ బర్న్‌హామ్ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆయన సోమవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే, స్టార్మర్ తన పదవికి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక స్కాండల్‌తో సంబంధాలున్న పీటర్ మండెల్సన్‌ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడం స్టార్మర్ కెరీర్‌లోనే పెద్ద మైనస్‌గా మారింది.

సెప్టెంబర్‌లో కొత్త పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ ముగుస్తుందని స్టార్మర్ తెలిపారు. బ్రిటన్ గత పదేళ్ల కాలంలో ఏకంగా ఏడో ప్రధానిని చూడబోతుండటం అక్కడ రాజకీయ అనిశ్చితికి అద్దం పడుతోంది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.