Iran-US peace talks : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న దీర్ఘకాలిక ఉద్రిక్తతలకు ముగింపు పలికి, సుస్థిర శాంతిని స్థాపించే దిశగా ఒక చరిత్రాత్మక అడుగు పడింది. దౌత్య చరిత్రలోనే అత్యంత కీలకమైన పరిణామంగా భావిస్తున్న అమెరికా-ఇరాన్ దేశాల శాంతి చర్చలు స్విట్జర్లాండ్‌ వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి.గతవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వర్చువల్ విధానంలో కుదుర్చుకున్న 14 అంశాల చరిత్రాత్మక అవగాహనా ఒప్పందం (MoU) ఆధారంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.
 స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ సమీపంలో గల ప్రసిద్ధ బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా జరగనున్న ఈ చర్చలలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎమ్.బి.గాలిబాఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తిత్వం చేయనున్నారు. 14 అంశాల మైలురాయి ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి. అణు ఒప్పందం కంటే ముందుగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ – హెజ్‌బొల్లా మధ్య తక్షణ కాల్పుల విరమణ అమలు చేయడం తొలి ప్రాధాన్యతగా ఉండనుంది.
ఈ సందర్భంగా ఖతార్‌లో స్తంభించిపోయిన $6 బిలియన్ల నిధుల విడుదల చేయడం ద్వారా ఇరాన్ కు ఆర్థిక ఊరట లభించనుంది.  ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా మూతబడిన వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’ని తిరిగి తెరవడం. అణ్వాయుధాల తయారీ తమ లక్ష్యం కాదని, కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ స్పష్టీకరణ వంటివి ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. చర్చల పర్యవేక్షణలో  రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కారణంగా శుక్రవారం ప్రారంభం కావాల్సిన చర్చలు ఆదివారానికి వాయిదా పడ్డాయి.
పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలను విడగొట్టేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ నగర సమీపంలో గల బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో సాంకేతిక స్థాయి చర్చలు ఆదివారం (జూన్ 21) అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ చర్చల కోసం ఇరు దేశాల ఉన్నతాధికారుల బృందాలు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. ఈ చరిత్రాత్మక దౌత్య ప్రక్రియలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన తన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్‌తో కలిసి అమెరికా నుండి బయలుదేరి ఆదివారం ఉదయానికి స్విట్జర్లాండ్ చేరుకుని చర్చల్లో జాయిన్ అయ్యారు. ఇరాన్ తరఫున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల ప్రతినిధి ఎమ్.బి.గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది.
ఈ చర్చల కోసం జ్యూరిచ్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పేరు పెట్టింది. ఇటీవల ఇరాన్‌లో చోటుచేసుకున్న ‘మినాబ్ పాఠశాల ఘటన’ బాధితుల జ్ఞాపకార్థం ఈ బృందానికి ‘మినాబ్ 168’ (Minab 168) అని నామకరణం చేయడం గమనార్హం. పశ్చిమాసియా భవిష్యత్తును మార్చగల సామర్థ్యం ఈ బృందం జరిపే చర్చలపైనే ఆధారపడి ఉంది.నిజానికి ఈ శాంతి చర్చలు గత శుక్రవారమే (జూన్ 19) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు పెరగడం, దానికి నిరసనగా ఇరాన్ సాయుధ దళాలు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల కారణంగా చర్చలు కాస్త ఆలస్యమై, షెడ్యూల్‌లో మార్పులతో ఆదివారం ఉదయం అత్యవసర సెషన్‌ ద్వారా పట్టాలెక్కాయి.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు అజెండాను మార్చాయి. లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే పరమావధిగా భావించి, మొదటి రోజు ఇజ్రాయెల్ – హెజ్‌బొల్లా మధ్య సుస్థిర కాల్పుల విరమణను అమలు చేయడంపైనే ఇరు పక్షాలు అత్యవసరంగా చర్చించాయి. ఇరు దేశాలూ సురక్షితంగా ఉండాలనేదే తమ ప్రాథమిక లక్ష్యమని జె.డి.వాన్స్ స్పష్టం చేశారు.
ఈ చరిత్రాత్మక చర్చల విజయవంతం కోసం తెరవెనుక దౌత్యం ముమ్మరంగా సాగుతోంది. అమెరికా అధ్యక్షుడి తరఫున రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే స్విట్జర్లాండ్‌లోనే ఉండి పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇరు దేశాలకు ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీతో పాటు, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైనిక దళాల అధినేత ఆసిమ్ మునీర్ కూడా స్విట్జర్లాండ్ చేరుకుని ఈ చర్చలను సజావుగా సాగించడంలో భాగస్వాములయ్యారు.
స్విట్జర్లాండ్ చర్చల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన ఈ డీల్‌లోని అంశాలు పూర్తిగా ఇరాన్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. గతంలో విధించిన ఆంక్షల సందర్భంలో ఇరాన్ లేవనెత్తిన అనేక అంశాలను, ఇరాన్ ప్రజల హక్కులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అంగీకరించారని ఆయన వెల్లడించారు.ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు పెద్ద ఆర్థిక ఊరట లభించనుంది. గతంలో ఆంక్షల కారణంగా ఖతార్ బ్యాంకుల్లో స్తంభించిపోయిన 6 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులు త్వరలోనే తమ స్వదేశానికి చేరుకోనున్నాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ ధృవీకరించారు. ఈ నిధుల విడుదల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా, అమెరికాతో కుదిరిన అవగాహనకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అత్యంత వివాదాస్పదమైన అణు కార్యక్రమంపై ఇరాన్ అధ్యక్షుడు మరోసారి తమ విధానాన్ని స్పష్టం చేశారు. ఇరాన్‌కు అణుబాంబు దక్కకూడదని అమెరికా షరతు విధించిన మాట వాస్తవమేనని, అయితే తాము కూడా అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత, ఇంధన ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. ఈ చరిత్రాత్మక డీల్ విజయవంతమైతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తీవ్ర నిరాశ తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందాన్ని (MoU) క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజులు అత్యంత కీలకం కానున్నాయి. ఈ కాలపరిమితిలోనే ఇరు దేశాలు అన్ని రకాల సాంకేతిక, చట్టపరమైన వివరాలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ఈ మొదటి విడత చర్చలు మరో రెండు మూడు రోజుల పాటు సాగే అవకాశం ఉందని సమాచారం.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.