missing case

Vijayawada :  రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన గాడే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన తరుణంలోనే.. సాయికృష్ణ అదృశ్యం వెనుక టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఉన్నట్లు అత్యంత కీలకమైన ఆధారాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు ఒక్కసారిగా వేగం పుంజుకుంది.

ఈ కేసు మొత్తంలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి విజయవాడ వరకు జరిగిన పరిణామాలు అత్యంత కీలకంగా మారాయి. గత మే నెలలో సాయికృష్ణ మార్కాపురంలో ఉన్నట్లు తెలుసుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ ఎస్సై నవీన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ప్రభుత్వ అధికారిక వాహనం కాకుండా, ఒక ప్రైవేట్ బండిలో రహస్యంగా మార్కాపురం వెళ్లిన ఎస్సై నవీన్ బృందం.. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చినట్లు బలమైన ఆధారాలు లభించాయి.

ఈ వ్యవహారం బయటకు రావడంతో పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న అడిషనల్ డీసీపీ లతాకుమారి, టాస్క్ ఫోర్స్ ఎస్సై నవీన్‌తో పాటు మార్కాపురం వెళ్లిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల స్టేట్‌మెంట్లను ఉన్నతాధికారులు రికార్డ్ చేశారు. అయితే, అసలు ఎవరి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం ప్రైవేట్ వాహనంలో అంత దూరం వెళ్లి సాయికృష్ణను తీసుకువచ్చింది? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అనే కోణంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది.

నాగరాజును సస్పెండ్

ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేయగా, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసుల లింకులు కూడా బయటపడటం ఖాకీ వనంలో కలకలం రేపుతోంది. సాయికృష్ణను విజయవాడకు తెచ్చిన తర్వాత ఏం చేశారు? పోలీస్ స్టేషన్‌లోనే అతనికి ఏమైనా జరిగిందా? అనే సస్పెన్స్‌కు తెరదించేందుకు ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ కొత్త ఆధారాల బేస్ చేసుకుని విచారణను మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.