Telegram : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు ప్రధాన వేదికగా మారిందని కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుత రోజుల్లో టెలిగ్రామ్ ఒక సరికొత్త ‘డార్క్ వెబ్’లా రూపాంతరం చెందిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ రీఎగ్జామ్ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ సదరు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ కేసు విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఒక కీలక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. క్రిమినల్ నెట్‌వర్క్‌లు, అతివాద ముఠాలు ఈ యాప్‌ను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయో అందులో పూర్తి వివరాలను వెల్లడించింది.

కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం… టెలిగ్రామ్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ, అనామక ఫీచర్లు నేరగాళ్లకు రక్షణ కవచాలుగా మారాయి. ఇక్కడి ప్రైవసీ సెట్టింగ్‌ల వల్ల యూజర్లు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీల వంటి గుర్తింపు వివరాలను సులభంగా దాచుకోవచ్చు. దీనివల్ల నేరాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఈ భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని క్రిమినల్స్ డార్క్ వెబ్ లింక్‌లతో పరస్పరం అనుసంధానమవుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, ఉగ్రదాడులు, మోసాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రం ధ్వజమెత్తింది.

ఈ ప్లాట్‌ఫామ్ విద్యావ్యవస్థను, దేశ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. NEET వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి, వాటి అక్రమ పంపిణీకి టెలిగ్రామ్ ఛానళ్లు వేదికగా మారాయని పేర్కొంది. దీనితో పాటు హింసాత్మక, తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి, తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడం ద్వారా పౌర సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఉగ్రవాద సంస్థలు ఈ యాప్‌ను వాడుకుంటున్నాయి. మరికొన్ని ముఠాలు చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అత్యంత అభ్యంతరకరమైన కంటెంట్‌ను (CSEAM) ఈ యాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ చేస్తున్నాయని, ఇది భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారిందని కోర్టుకు విన్నవించింది.

మరోవైపు టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఆర్థిక మోసాలు, డేటా లీకులపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదులు భారీగా పెరిగాయి. హ్యాకర్లు దొంగిలించిన డేటాను విక్రయించడానికి, మనీ లాండరింగ్ కోసం ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ను కొనుగోలు చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు. కొన్ని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు బాధితుల డేటాను దొంగిలించడానికి టెలిగ్రామ్‌ను కమాండ్ అండ్ కంట్రోల్ హబ్‌గా వాడుకుంటున్నాయి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను బైపాస్ చేసే టూల్స్, నకిలీ ఫైనాన్స్ యాప్‌ల రూపంలో ఉండే మాల్వేర్‌లను ఇక్కడ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పౌరుల మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేలా టెలిగ్రామ్ బోట్లు (Bots) పనిచేస్తుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటికి తోడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను అనధికారికంగా పంపిణీ చేస్తూ పైరసీకి కేంద్రంగా మారడం వల్ల కంటెంట్ క్రియేటర్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని తెలిపింది.

నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. మోసపూరిత నెట్‌వర్క్‌లను అరికట్టడానికి, జూన్ 21న జరగబోయే రీటెస్ట్ సజావుగా సాగేలా చూడటానికి కేంద్రం ఈ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలు జూన్ 22 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు లేదా కేవలం ఆరోపణల ఆధారంగానే ఎవరినీ నేరస్థులుగా ముద్ర వేయలేమని, పూర్తిస్థాయి విచారణలోనే నిజానిజాలు తేలాల్సి ఉందని కోర్టు పేర్కొంటున్నప్పటికీ, ఈ లోపు వ్యవస్థల భద్రతను కాపాడటం అత్యంత ముఖ్యమని కేంద్రం భావించింది. డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్న దర్యాప్తు సంస్థలకు టెలిగ్రామ్ ప్రైవసీ పాలసీ పెను సవాలుగా నిలుస్తోందని, అందుకే దేశ భద్రత, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ చర్యలు తప్పలేదని కేంద్రం తన అఫిడవిట్‌లో సమగ్రంగా వివరించింది.