ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో రోజుకో కొత్త స్టార్టప్ పుట్టుకొస్తోంది. అయితే, ఏఐ దిగ్గజం ‘ఓపెన్ ఏఐ’ ఉద్యోగాన్ని వదిలి, సొంతంగా స్టార్టప్ పెట్టిన భారత సంతతి యువకుడు యశ్ పాటిల్ కేవలం రెండేళ్లలోనే అద్భుతం సృష్టించారు. ఆయన స్థాపించిన ‘అప్లైడ్ కంప్యూట్’ సంస్థను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం ‘పాలో ఆల్టో నెట్‌వర్క్స్’ ఏకంగా 4.5 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ.40,000 కోట్లకు పైగా) కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

ఓపెన్ ఏఐ నుంచి సొంత స్టార్టప్ వరకు..
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివిన యశ్ పాటిల్.. 2023 ఏప్రిల్‌లో ఓపెన్ ఏఐలో టెక్నికల్ స్టాఫ్ రెసిడెంట్‌గా చేరారు. ఏఐ మోడల్స్ ట్రైనింగ్ తర్వాత వచ్చే సమస్యలను పరిష్కరించడం ఆయన ప్రధాన విధి. 2025 మే వరకు అక్కడ పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇద్దరు సహోద్యోగులతో కలిసి ‘అప్లైడ్ కంప్యూట్’ స్టార్టప్‌ను ప్రారంభించారు. కంపెనీలు తమ రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా సొంత ఏఐ మోడళ్లను సులభంగా ట్రైన్ చేసుకునేలా, వాటిని మేనేజ్ చేసుకునేలా అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఈ సంస్థ అందిస్తోంది.

ప్రస్తుతం దాదాపు అన్ని కార్పొరేట్ సంస్థలు తమ బిజినెస్ ఆపరేషన్స్‌లో ఏఐని భాగం చేస్తున్నాయి. సొంత ఏఐ మోడల్స్‌ను తయారు చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అప్లైడ్ కంప్యూట్ రూపొందించిన ఏఐ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుండటంతో పాలో ఆల్టో నెట్‌వర్క్స్ దీనిపై కన్నేసింది. సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న పాలో ఆల్టో.. ఈ డీల్ ద్వారా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత యశ్ పాటిల్ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో ‘కో-చీఫ్ ఏఐ ఆఫీసర్’గా బాధ్యతలు చేపట్టనున్నారు.