మానవ మేధస్సుకు నిదర్శనంగా నిలిచిన ‘వాయేజర్-1’ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష పరిశోధనల్లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఈ నౌక, నవంబర్ 18 మధ్యాహ్నం 3:46 గంటలకు భూమి నుంచి ఒక ‘లైట్ డే’ దూరాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. మానవుడు నిర్మించిన అత్యంత దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్‌గా ఇది రికార్డ్ నెలకొల్పింది.

‘లైట్ డే’ అంటే ఎంత దూరం?
కాంతి ఒక రోజులో (24 గంటల్లో) ప్రయాణించే దూరాన్ని ‘లైట్ డే’ అంటారు. సెకన్‌కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి, ఒక రోజులో సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు వెళ్తుంది. గంటకు 61 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న వాయేజర్-1కు ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 50 ఏళ్లు పట్టింది. దీనిని బట్టే విశ్వం ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు.

1977 సెప్టెంబర్ 5న నాసా దీనిని ప్రయోగించింది. ‘గ్రావిటేషనల్ అసిస్ట్’ టెక్నాలజీ సాయంతో 1979లో బృహస్పతి, 1980లో శని గ్రహాలను సమీపంగా పరిశీలించి అద్భుతమైన డేటాను అందించింది. 2012లో సూర్యమండల సరిహద్దు అయిన ‘హీలియోపాజ్’ను దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగుపెట్టింది.

1970ల టెక్నాలజీతోనే సిగ్నల్స్!
సోలార్ ప్యానెల్స్ లేకపోయినా, ప్లూటోనియం-238 ఆధారిత థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ల సాయంతో ఈ నౌక ఇప్పటికీ పనిచేస్తోంది. పవర్ తగ్గుతున్నందున కొన్ని పరికరాలను ఆఫ్ చేసిన నాసా, 2030 వరకు ఈ మిషన్ కొనసాగేలా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ‘గ్లీసే 445’ నక్షత్రం వైపు వెళ్తున్న వాయేజర్-1లో భూమి వివరాలతో కూడిన ‘గోల్డెన్ రికార్డ్’ ఉంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహాంతర నాగరికత తారసపడితే, భూమి ఉనికిని చాటే సందేశంగా ఇది పనిచేయనుంది.