డిసెంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా మోటార్ ఇన్సూరెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు మనం వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏజెంట్లు లేదా కంపెనీలు చెప్పిన ప్లాన్ తీసుకుని డబ్బులు కట్టేసేవాళ్లం. అందులో మనకు ఏ కవరేజీ ఉంది.. దేనికి ఎంత ప్రీమియం కడుతున్నామో చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈ గందరగోళానికి తెరదించుతూ,సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ నవంబర్ 2న సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి అమలు అయ్యే ఈ కొత్త రూల్స్ ప్రకారం మోటార్ ఇన్సూరెన్స్‌ను స్పష్టంగా నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు. దీనివల్ల వాహనదారులకు తమకు అవసరమైన బీమాను మాత్రమే ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ లభించనుంది. ఇంతకీ ఆ నాలుగు విభాగాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

Also Read : ఆల్ టైమ్ రికార్డు.. తులం బంగారంపై రూ.44 వేలు తగ్గింపు.. ఇంకా తగ్గుతుందా?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

మీ వాహనం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఎదుటివారికి గాయాలైనా, ప్రాణనష్టం జరిగినా లేదా ఇతరుల ఆస్తులకు నష్టం వాటిల్లినా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. చట్టప్రకారం రోడ్డుపై తిరిగే ప్రతి బైక్, కారుకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. దీనిని ఎంచుకోవడంలో ఎలాంటి మినహాయింపు ఉండదు.

వాహనంలో ప్రయాణించే వారికి బీమా

మీ కారులో ప్రయాణించే వారికి లేదా మీ బైక్ వెనుక సీట్లో కూర్చునే వారికి ప్రమాదం జరిగినప్పుడు, యజమానిపై ఉండే చట్టపరమైన బాధ్యతల నుంచి ఈ బీమా రక్షణ ఇస్తుంది. అవసరాన్ని బట్టి వాహన యజమానులు దీనిని ఎంచుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో యజమాని వద్ద పనిచేసే డ్రైవర్లు, ఉద్యోగులకు కూడా ఈ కవరేజీ వర్తిస్తుంది.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమాని కమ్ డ్రైవర్‌కు గాయాలైనా, దురదృష్టవశాత్తు మరణం సంభవించినా ఈ బీమా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుంది. యజమాని డ్రైవర్‌కు ఈ వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవడం తప్పనిసరి. అయితే వాహనంలో ప్రయాణించే ఇతర వ్యక్తులు, వెనుక కూర్చునే వారు లేదా అదనపు డ్రైవర్లకు ఈ కవర్ తీసుకోవాలా వద్దా అనేది యజమాని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

ఓన్ డ్యామేజ్ కవర్

ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర కారణాల వల్ల మీ సొంత బైక్ లేదా కారు దెబ్బతింటే ఆ రిపేర్ ఖర్చులను పాలసీ నిబంధనల ప్రకారం బీమా కంపెనీ భరిస్తుంది. ఈ కవరేజీ తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వాహన యజమాని నిర్ణయమే.

Also Read : ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి షాకింగ్ న్యూస్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఏంటంటే?

కొత్త విధానంతో వాహనదారులకు కలిగే లాభాలేంటి?

ఇకపై మీరు ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ తీసుకున్నా, నేరుగా ఆఫీస్‌కు వెళ్లి తీసుకున్నా బీమా కంపెనీలు మీకు ఒక ప్రత్యేక ఆప్షన్ ఫారం ఇవ్వాలి. అందులో ఈ నాలుగు విభాగాల వివరాలు, వాటికి అయ్యే ప్రీమియం ధరలు విడివిడిగా స్పష్టంగా ఉంటాయి. మీకు అవసరమైన వాటిని మాత్రమే టిక్ చేసి పాలసీ తీసుకోవచ్చు. అంతేకాకుండా పాలసీ కొనే సమయంలో కంపెనీలు తప్పనిసరిగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అందించాలి. దీనివల్ల ఏ కవరేజీకి మనం ఎంత డబ్బు కడుతున్నామో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పటికే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే కొత్త రూల్స్ వచ్చాక పాత పాలసీని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు ప్రీమియం చెల్లించి, మీ కారులో ప్రయాణించే వారికి కూడా బీమా రక్షణను మీ ప్రస్తుత పాలసీకి జోడించుకునే వెసులుబాటు కల్పించారు.