
Priyanka Gandhi : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు జరిపే బాధ్యతను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీకి అప్పగించినట్లు సమాచారం. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు చర్చలను ఆమె ముందుండి నడిపించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకు ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ సీనియర్ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజకీయాల్లో కీలకమైన హిందీ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి.
ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై ప్రజల్లో మార్పు కోరుకునే ఆలోచన ఉందని ఆయన అన్నారు. అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కులకు మరింత రక్షణ కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఖర్గే వెల్లడించారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలకు కొత్త దిశ చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Also Read : యూపీఐ యూజర్లకు ఆర్బీఐ బిగ్ అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు రూల్స్!
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, రాహుల్ గాంధీకి సన్నిహిత నేత కే.సీ. వేణుగోపాల్ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై స్పందించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాల మాదిరిగానే ఈసారి కూడా ఇండియా కూటమి పార్టీలతో కలిసి బీజేపీని ఓడిస్తామని ఎక్స్‌లో పోస్టు చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 33 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలు తమ కూటమికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
డిసెంబర్ మొదటి వారంలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఎంపీ ఇమ్రాన్ మసూద్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, యాత్రలు నిర్వహిస్తారని చెప్పారు. ఇది పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశమని, ఇండియా కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, అందరూ కలిసి ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా పొత్తులపై స్పందించారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై అధికారిక చర్చలు ఇంకా మొదలుకాలేదని చెప్పారు. అయితే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ సీట్లను సర్దుబాటు చేసుకుంటామని, బలమైన అభ్యర్థులకే అవకాశం ఇస్తామని తెలిపారు.
Also Read : ప్రేమ.. డ్రగ్స్.. పాక్ లింకులు.. వెలుగులోకి సంచలన విషయాలు!









