Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంతో మనస్తాపానికి గురైన 28 ఏళ్ల పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఓ పోలీసు అధికారి ఈ వివరాలను వెల్లడించారు. మృతుడిని సందీప్ కుమార్ (28)గా గుర్తించారు. ఆయన సంత్ కబీర్ నగర్ ప్రాంతానికి చెందినవారు. గత 11 నెలలుగా బల్లియా జిల్లాలోని చిట్బర్హాగావ్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రైల్వే లోకో పైలట్ తదుపరి స్టేషన్‌లో ఇచ్చిన ఎంఆర్‌ఓ నివేదికలో ఈ విషయం ప్రస్తావించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా, రైల్వే ట్రాక్ సమీపంలో ఓ బుల్లెట్ బైక్ కనిపించింది.

పోలీసులు విచారణ చేపట్టి మృతుడు సందీప్ కుమార్ అని గుర్తించారు. ఆయన వ్యక్తిగత విషయాలపై కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో సికందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతితో సందీప్‌కు ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి సందీప్‌పై ఒత్తిడి తెస్తోందని, అంతేకాకుండా బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు.

ఇదే యువతి రెండేళ్ల క్రితం మరో పోలీసు అధికారిపై అత్యాచారం కేసు పెట్టినట్లు కూడా ఎస్పీ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సందీప్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసుకు సంబంధించిన చట్టపరమైన చర్యలు చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.