భారత సరిహద్దుల వెంబడి చైనా మరోసారి తన కవ్వింపు చర్యలకు తెరలేపింది. ఈ నెల 12వ తేదీన చైనాకు చెందిన ఒక మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ సిక్కింలోని భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో సుమారు 25 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఈ విమానం 20 నుండి 25 నిమిషాల పాటు భారత భూభాగంలో చక్కర్లు కొట్టింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) రాడార్లు దీని కదలికలను పసిగట్టి, తమ భూభాగంలోకి వెళ్లిపోవాలని పదేపదే వార్నింగ్స్ జారీ చేశాయి.

‘చికెన్స్ నెక్’ వద్ద టెన్షన్ ఎందుకు?
ఈ చొరబాటు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘సిలిగురి కారిడార్‌’కు ఎదురుగా జరగడం భద్రతా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఈ సన్నని భూభాగం (సుమారు 20-22 కి.మీ వెడల్పు) ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలుపుతుంది. దీనినే ‘చికెన్స్ నెక్’ అని పిలుస్తారు. చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలకు సమీపంలో ఉండటంతో పాటు, డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ఈ ఏరియాలో చైనా కదలికలు భద్రతా పరంగా అత్యంత సున్నితమైనవి.

చైనా ఇలా ఎయిర్‌స్పేస్ నిబంధనలను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి కాదు.

  • ఈ నెల 7న కూడా నాలుగు చైనా హెలికాప్టర్లు లద్దాఖ్‌లోకి చొరబడ్డాయి.

  • 2022 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని భారత బేస్ క్యాంపులకు అతి సమీపం నుంచి చైనా విమానం దూసుకెళ్లింది.

  • 2020 గల్వాన్ ఘర్షణల సమయంలోనూ ఎల్‌ఏసీ (LAC) వెంబడి చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టగా, ఐఏఎఫ్ తన ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది.

  • అంతకుముందు 2017లో ఉత్తరాఖండ్‌లోని బరాహోటి ప్రాంతంలోనూ చైనా హెలికాప్టర్లు చొరబడ్డాయి.

వరుసగా జరుగుతున్న ఈ ఎయిర్‌స్పేస్ ఉల్లంఘనల నేపథ్యంలో భారత సైన్యం, వైమానిక దళం సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించాయి.