2040 నాటికి చంద్రుడిపై మన త్రివర్ణ పతాకాన్ని చూడటమే తన నిజమైన గోల్ అని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా స్పష్టం చేశారు. శనివారం చండీగఢ్‌లో జరిగిన 10వ ‘మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన, తన స్పేస్ జర్నీ అనుభవాలను, భవిష్యత్ లక్ష్యాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. ‘యాక్సియం మిషన్-4’లో భాగంగా తాను ISSకు వెళ్లినప్పుడు, అంతరిక్షంలో ఉన్నా తనకు ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదని శుక్లా చెప్పారు. 140 కోట్ల మంది భారతీయులు తన వెంటే ఉన్నారనే భావన తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ మిషన్ కోసం తాను ఫుల్ స్పీడ్‌తో ప్రిపేర్ అవుతున్నట్లు వెల్లడించారు.

టేకాఫ్ సమయంలో ఆ డౌట్ వచ్చింది:
తన అంతరిక్ష ప్రయాణంలోని ఓ కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ.. ISS నుంచి తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ క్యాప్సూల్‌లో టేకాఫ్ అయ్యే ప్రాసెస్ చాలా గందరగోళంగా, ఉత్కంఠభరితంగా సాగిందని తెలిపారు. ఆ క్షణంలో “అసలు అంతరిక్ష యాత్ర చేయాలన్న నా డెసిషన్ కరెక్టేనా?” అనే సందేహం కూడా మనసులో మెదిలిందని నిజాయితీగా చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లోకి రావాలని శుక్లా పిలుపునిచ్చారు. కేవలం కలలు కనడమే కాకుండా, వాటిని సాకారం చేసుకునేందుకు సాహసోపేతంగా ముందడుగు వేయాలని స్టూడెంట్స్‌కు సూచించారు. ఆయన స్పీచ్ అక్కడికి వచ్చిన యువతలో సరికొత్త జోష్ నింపింది.