
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు తపాలా శాఖ ఒక గొప్ప శుభవార్తను అందించింది. ఇకపై భక్తులు తమ తిరుగు ప్రయాణంలో ప్రసాదం ప్యాకెట్లను మోసుకెళ్లే ఇబ్బంది లేకుండా, నేరుగా పోస్ట్ ద్వారా తమ ఇంటి అడ్రస్‌కు పంపించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో ఇండియా పోస్ట్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
నవంబర్ 17 నుంచి 41 రోజుల పాటు జరగనున్న మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ కోసం ఈ ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. శబరిమల సన్నిధానంలోని అరవణ, అప్పం కౌంటర్ల పక్కనే ఇండియా పోస్ట్ 24 గంటల పాటు పనిచేసే ‘స్పెషల్ పార్శిల్ బుకింగ్ సెంటర్’ను ఏర్పాటు చేస్తోంది. దర్శనం అనంతరం భక్తులు ఈ కౌంటర్లో తమకు కావాల్సినన్ని అరవణ పాయసం, అప్పం ప్రసాదం ప్యాకెట్లను బుక్ చేసుకోవచ్చు.
అధిక రద్దీ కారణంగా ప్రయాణంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ కె. జయకుమార్, కేరళ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్ తెలిపారు. భక్తులు బుక్ చేసిన ప్రసాదాన్ని అత్యంత సురక్షితంగా ప్యాకింగ్ చేసి, స్పీడ్ పోస్ట్ పార్శిల్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ చేస్తారు. భక్తులు యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకునే సమయానికి ప్రసాదం కూడా వారి ఇంటికి చేరేలా ప్లాన్ చేశారు. కేవలం శబరిమల ఆలయ ప్రాంగణంలోనే కాకుండా, దేశంలోని ఇతర పోస్టాఫీసుల ద్వారా కూడా ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.









