Bengaluru : బెంగళూరులో ఏడుగురి హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ప్రధాన నిందితుడు ఇందుశేఖర్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఏడుగురిని చంపిన తర్వాత తనకు ప్రశాంతంగా ఉందని, ఇప్పుడు మనశ్శాంతి లభించిందని అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తన భార్య ఎప్పుడూ తనను తిడుతూ ఉండేదని, కుటుంబ సభ్యుల ముందు అవమానించేదని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.

భార్య కుటుంబ సభ్యులంతా ఆమెకే మద్దతుగా ఉండేవారని, తనను మాత్రం ఎప్పుడూ గౌరవించేవారు కాదని ఇందుశేఖర్ పోలీసులకు వెల్లడించాడు. కుటుంబంలో తనకు విలువ లేకుండా పోయిందని విచారణలో వివరించినట్లు తెలుస్తోంది. ఈ అవమానాల వల్లే కుటుంబ సభ్యులందరినీ చంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. హత్యలు చేయడమే కాకుండా, మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు కూడా ముందుగానే పథకం వేసుకున్నట్లు విచారణలో బయటపడింది.

ఈ కేసులో నిందితుడి కుమార్తె పాత్ర కూడా బయటపడటం కలకలం రేపుతోంది. తన తండ్రి కుటుంబ సభ్యులను చంపాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసినా ఆమె అతడికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరుకు మారుస్తానని తండ్రి హామీ ఇవ్వడంతో ఆమె సహాయం చేసేందుకు అంగీకరించినట్లు విచారణలో తేలింది. హత్యల తర్వాత మృతదేహాలను తరలించడంలో కూడా ఆమె తండ్రికి తోడ్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇంట్లో హత్యలు జరిగిన తర్వాత రక్తపు మరకలు కనిపించకుండా చేసేందుకు అవసరమైన రసాయనాలు, ఇతర వస్తువులను కూడా కుమార్తె తెచ్చినట్లు సమాచారం. ఇంట్లో రక్తపు మరకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. తన తల్లి వాటాగా రావాల్సిన ఆస్తి చివరకు తనకే దక్కుతుందని తండ్రి ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ హత్యల వెనుక ఆస్తి వివాదమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

బెంగళూరులోని శ్రీరాంపుర ప్రాంతంలో సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తి విషయంలో ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. తన అత్తకు చెందిన ఆస్తిలో ఎక్కువ వాటా కావాలని ఇందుశేఖర్ అడిగినట్లు సమాచారం. అయితే ఆమెకు ఇద్దరు కుమారులు ఉండటంతో, అందరికీ న్యాయంగా రావాల్సిన వాటానే ఇస్తానని అత్త చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

హత్యలు చేసిన తర్వాత కూడా నిందితుడు ఆస్తి పత్రాల విషయంలో తన ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి వేలిముద్రలను స్టాంప్ పేపర్లపై తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి, వాటాలకు సంబంధించిన పత్రాలపై వారి వేలిముద్రలు ఉన్నట్లు చూపించి ఆస్తిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది అతడి ఆలోచనగా పోలీసులు భావిస్తున్నారు. తాను ఏడుగురిని చంపినా ఎవరికీ అనుమానం రాదని, పోలీసులు కూడా పట్టుకోలేరని కుమార్తెకు చెప్పినట్లు సమాచారం.

మరోవైపు ఏడుగురిని హత్య చేసినట్లు ఇందుశేఖర్ చెప్పినప్పుడు తొలుత పోలీసులు నమ్మలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే విచారణలో అతడు చెప్పిన ప్రాంతాలకు వెళ్లి మృతదేహాలను గుర్తించడంతో పోలీసులు విస్తుపోయారు. ఒక్కొక్కరిని చంపి, మృతదేహాలను వేర్వేరు ప్రాంతాలకు తరలించిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో కుమార్తె కూడా సహకరించినట్లు ఆధారాలు లభించడంతో ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.