
BIG BREAKING : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన యర్రా శేషగిరిరావు అలియాస్ గిరిబాబు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజ నటుడు దూరమయ్యారంటూ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గిరిబాబు 1946 జూన్ 8లో ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో జన్మించాడు. శ్రీదేవి ఇతని భార్య 2016 మే 12 న మూత్రపిండాల వ్యాధితో కన్నుమూసింది. గిరిబాబుకి రఘుబాబు, బోసుబాబు ఇద్దరు కొడుకులున్నారు. గిరిబాబుకు చిన్నతనం నుండే నాటకరంగం పట్ల ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. 1973 లో విడుదలైన జగమే మాయ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్నమైన పాత్రల్లో సుమారు 600లకు పైగా సినిమాలలో నటించారు. ‘పసివాడి ప్రాణం’, ‘భైరవ ద్వీపం’, ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అతడు’ వంటి ఎన్నో అద్భుతమైన , ట్రెండ్ సెట్టర్ చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సినిమాల్లో ఆయన పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రత్యేక శైలిని కలిగి ఉండేవి.
కేవలం నటుడిగానే పరిమితం కాకుండా గిరిబాబు గారు దర్శక, నిర్మాతగా కూడా తన సత్తా చాటుకున్నారు. ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజీత్’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ‘రణరంగం’, ‘ఇంద్రజీత్’, ‘నీ సుఖమే నే కోరుకున్న’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. సినిమా నిర్మాణ రంగంలోని కష్టనష్టాలను తట్టుకుంటూ కళామతల్లికి ఆయన చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.









