
2001 నాటి భయాలను మళ్లీ గుర్తు చేస్తూ అమెరికా గగన తలం అకస్మాత్తుగా మూతపడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన పెను సాంకేతిక లోపం కారణంగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను నిలిపివేయడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇలా దేశవ్యాప్తంగా గ్రౌండ్స్టాప్ విధించడం ఇదే తొలిసారి కావడంతో.. ఇదొక సైబర్ దాడా లేక ఉగ్రవాద కుట్రనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారులు వెంటనే స్పందించి అసలు నిజమేంటో తెలిపారు.
అసలు కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏం జరిగిందనే విషయంపై అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ కీలక వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలన్నింటిలోనూ సమాచార ప్రసార వ్యవస్థ ఒకేసారి మొరాయించిందని తెలిపారు. ఒక విమానాశ్రయం నుంచి మరొక విమానాశ్రయానికి విమానాలు సురక్షితంగా ప్రయాణించడంలో ఈ కేంద్రాలు అత్యంత కీలకం. పాతబడిన సాంకేతిక పరికరాలు, నెట్వర్క్ రౌటర్లపై విపరీతమైన భారం పడటం వల్లే పైలట్లు, కంట్రోల్ రూమ్ మధ్య సమాచార మార్పిడి నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విమానాలను గాల్లోకి అనుమతిస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా FAA విమానాలన్నింటినీ నిలిపివేసింది.
ఈ సాంకేతిక సంక్షోభం వల్ల అమెరికా విమానయాన రంగం కనీవినీ ఎరుగని రీతిలో దెబ్బతింది. దేశవ్యాప్తంగా 13,000కు పైగా విమానాలు పూర్తిగా రద్దు కాగా, మరో 10,000కు పైగా విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. అంతేకాకుండా అప్పటికే గాల్లో ఉన్న కనీసం 600 విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో 496 విమానాలు తిరిగి బయలుదేరిన విమానాశ్రయాలకే వెనుదిరగగా, 104 విమానాలను సమీపంలోని ఇతర ఎయిర్‌పోర్టులలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్వేన్ ముల్లిన్ స్పందిస్తూ.. ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి సైబర్ దాడి లేదా ఉగ్రవాద కుట్రకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం మాత్రమేనని పేర్కొన్నారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసే వరకు ఏ అవకాశాన్నీ పూర్తిగా తోసిపుచ్చలేమని అన్నారు. మరోవైపు ఈ ఘటనకు ఒక రోజు ముందు మైక్రోసాఫ్ట్ సర్వర్లలో తలెత్తిన సమస్యలకు.. ఈ విమానాల నిలిపివేతకు సంబంధం ఉందంటూ జరిగిన ప్రచారాన్ని మైక్రోసాఫ్ట్ ఖండించింది. తమ సేవలకు, FAA సమస్యలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
అమెరికాలో నెలకొన్న ఈ గందరగోళ ప్రభావం భారత ప్రయాణికులపైనా పడింది. అమెరికాకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. ప్రయాణికులు ముందుగానే తమ విమానాల తాజా స్థితిని తనిఖీ చేసుకోవాలని ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా సూచనలు జారీ చేసింది.
కాగా సాంకేతిక నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయడంతో రాత్రి 8:15 గంటలకు అమెరికా తన గగనతలాన్ని తిరిగి తెరిచింది. కంట్రోల్ కేంద్రాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ ప్రకటించారు. అయితే నిలిచిపోయిన వేలాది విమానాలను వెంటనే నడపడం సాధ్యం కాదని, పైలట్లు, సిబ్బంది అందుబాటును బట్టి సర్వీసులు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.









