తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు సామాన్య కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబ పోషణ భారమై, చేసిన అప్పులు తీర్చలేక ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని కార్మికులు తమ సొంత శరీర అవయవాలనే అమ్మకానికి పెడుతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. నవంబర్ 11న లేబర్ న్యూస్ ఏజెన్సీ ‘ఇల్నా’ ప్రచురించిన కథనం ఈ విషాదకర వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.

Also Read : 23 ఏళ్ల అమెరికా చరిత్రను తిరగరాసిన ట్రంప్.. ఏ విషయంలోనో తెలుసా?

సెంట్రల్ టెహ్రాన్‌లోని ఫర్హాంగ్ హొస్సేనీ స్ట్రీట్—దీనిని స్థానికులు ‘కిడ్నీ స్ట్రీట్’ అని పిలుస్తారు—ఇప్పుడు అవయవాల అమ్మకపు ప్రకటనలకు అడ్డాగా మారింది. అక్కడి గోడలు, షట్టర్లపై కిడ్నీలు, లివర్ టిష్యూ , బోన్ మ్యారో అమ్మకానికి ఉన్నాయంటూ ఫోన్ నంబర్లతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. సాద్రా ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులే ఎక్కువగా ఈ దారి పడుతున్నారు. సాధారణంగా ఒక కిడ్నీకి 30 నుండి 40 బిలియన్ రియాల్స్ (సుమారు $11,500 నుండి $15,300) వరకు డిమాండ్ చేస్తుండగా, అరుదైన బ్లడ్ గ్రూప్స్‌కు 50 బిలియన్ రియాల్స్ ($19,200) వరకు ధర పలుకుతోంది.

కనీస వేతన కార్మికుల నెలవారీ ఆదాయం కేవలం 200 నుండి 300 మిలియన్ రియాల్స్ ($77 – $115) మాత్రమే ఉండగా, కుటుంబ ఖర్చులకు నెలకు కనీసం ఒక బిలియన్ రియాల్స్ ($383) అవసరమవుతున్నాయి. ఈ భారీ వ్యత్యాసం వల్ల 30 ఏళ్ల బైక్ కొరియర్, 33 ఏళ్ల కన్‌స్ట్రక్షన్ వర్కర్ వంటి ఎందరో యువకులు అప్పులు తీర్చేందుకు తమ కిడ్నీ, లివర్, బోన్ మ్యారోలను ఒకేసారి అమ్మకానికి పెట్టారు. అప్పుల బాధ తట్టుకోలేక కొందరు సాధారణ ధర కంటే 30 శాతం తక్కువకే అవయవాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

దేశంలో సుమారు 80 లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయారని, 5 కోట్ల మందికి పైగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అలీ బాబాయి కర్నామి ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులు భరించలేక ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. తక్షణ ఆర్థిక అవసరాల కోసం కార్మికులు తమ శరీర భాగాలను అమ్ముకోవడం వల్ల, భవిష్యత్తులో వారు శారీరకంగా బలహీనపడి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : 48 గంటల్లో హోర్మూజ్ ఓపెన్.. ఇరాన్ ఆఫర్..!!