దేశ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ప్రధాని మోడీ ట్యాప్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా, ప్రధానితో ముఖాముఖి బహిరంగ చర్చకు సిద్ధమంటూ మరోసారి సవాల్ విసిరారు.

శుక్రవారం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్’ (Q&A) సెషన్‌లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ విదేశీ శక్తుల కంట్రోల్‌లో ఉన్నారని మీరు చేస్తున్న ఆరోపణలకు ప్రూఫ్స్ ఏంటని సదరు వ్యక్తి ప్రశ్నించగా, రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్‌ను చూపిస్తూ సమాధానమిచ్చారు.

Also Read : మైక్రోసాఫ్ట్ సేవలు డౌన్.. లక్షల మందికి ఇబ్బందులు.. అసలు ఏం జరిగింది?

“ప్రూఫ్ ఇక్కడే ఉంది.. నా ఫోన్‌లోనే ఉంది. ఈ విషయం ప్రధానికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. ఆయన నాతో డైరెక్ట్‌గా డిబేట్‌కు వస్తే, అసలు ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారు? ఎవరు దేశ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారు? ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతోంది? అనే నాకు తెలిసిన అనేక సంచలన విషయాలు ప్రజలందరికీ తెలుస్తాయి” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

అయితే, తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని రాహుల్ గాంధీ ఆరోపించినప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ఆధారాలను ఆయన బహిరంగంగా సమర్పించలేదు. తాను చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీతో వన్-ఆన్-వన్ డిబేట్ జరగాలని రాహుల్ గాంధీ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని చర్చకు వస్తే ఎన్నో నిజాలు బయటపడతాయని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ నేరుగా ప్రధానిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో కొత్త రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : వాట్సాప్ నుంచి బుర్రపాడు ఫీచర్.. ఒక్కసారి చూస్తే మాయమైపోతుంది..!