
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి అడ్డాగా మారిన దేశంగా పాకిస్తాన్.. ఒకవైపు ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పే ఆ దేశ పాలకుల నిజ స్వరూపం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. అయితే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌తో పాక్ సైన్యాధిపతి (ఆర్మీ చీఫ్) జనరల్ అసిమ్ మునీర్ రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఈ రహస్య సమావేశం సెప్టెంబర్ 16వ తేదీన సుమారు రెండున్నర గంటల పాటు గోప్యంగా సాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో అసిమ్ మునీర్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఒక అతిథి గదిలో ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో మసూద్ అజార్‌తో పాటు ముఫ్తీ అబ్దుల్ రహీమ్, మౌలానా తాహిర్ అష్రఫీ వంటి వారు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక దేశ సైన్యాధిపతి స్వయంగా తన దేశమే తీవ్రవాదిగా ముద్ర వేసి కోట్లాది రూపాయల రివార్డు ప్రకటించిన ఉగ్రవాద నాయకుడిని ఇలా రహస్యంగా కలవడం ఆ దేశ కుట్రపూరిత వైఖరి అని తెలుస్తోంది. అయితే కేవలం భారత్‌పై కుట్ర పన్నడానికే సీక్రెట్‌గా కలిసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read : 23 ఏళ్ల అమెరికా చరిత్రను తిరగరాసిన ట్రంప్.. ఏ విషయంలోనో తెలుసా?
ఈ సమావేశం వెలుగులోకి రావడానికి కాస్త ముందు జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయి. కిష్త్వార్‌లో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను కాల్చి చంపడం వెనుక జైష్-ఎ-మొహమ్మద్ హస్తం ఉందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అలాగే కుల్గాంలోని సీఆర్పీఎఫ్ చెక్‌పాయింట్‌పై జరిగిన దాడి లష్కర్-ఎ-తైబా ఆదేశాల మేరకు జరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా భారతదేశంలో ఉగ్రవాద కదలికలు ఊపందుకుంటున్న తరుణంలోనే పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా ఉగ్రవాద అగ్రనేతను కలవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా ఏదైనా భారీ కుట్రకు పాక్ సైన్యం తెరలేపిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్తాన్ ఎప్పుడూ తాము కూడా ఉగ్రవాద బాధితులేనని.. తమ దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని ప్రపంచ దేశాల ముందు నాటకాలు ఆడుతుంటుంది. కానీ ఆ దేశ సైన్యాధిపతే స్వయంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. రహస్య సమావేశాలు జరుపుతుండటం ఆ దేశ అబద్ధాలను బట్టబయలు చేస్తోంది. తమ దేశపు రెడ్ బుక్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా చేర్చి ఏకంగా రూ. 70 లక్షల భారీ నజరానా ప్రకటించిన మసూద్ అజార్‌తో ఆర్మీ చీఫ్ మునీర్ భేటీ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రపంచ దేశాలను మోసం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పైకి ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు నటిస్తూ లోపల మాత్రం వారికి అన్ని రకాల రక్షణ, సహకారం అందిస్తోందనేది ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువవుతోంది. తమ గడ్డపై ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని పాక్ ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ.. ఈ రహస్య భేటీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ బండారాన్ని, సైన్యం కుట్రలను ప్రపంచం ముందు నిలబెట్టింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్తాన్‌ను మరింత ఇరుకున పెట్టే అవకాశం ఉంది.
Also Read : అమెరికాలో చైనా కుట్ర!.. అందమైన అమ్మాయితో భారీ స్కెచ్..?









