ఎన్వీడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ ఇప్పుడు తన వ్యాపార విజయాల కంటే.. వ్యక్తిగత జీవితంలోని వివాదాల వల్లే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయనే సంచలన విషయాలు వరుసగా బయటపడటంతో ఈ వ్యవహారం కాస్తా కార్పొరేట్ ప్రపంచంతో పాటు అంతర్జాతీయ గూఢచర్యం, బిలియన్ల డాలర్ల ఏఐ చిప్ వ్యాపారంతో ముడిపడి పెను దుమారం రేపుతోంది. ఈ వివాదాల నేపథ్యంలోనే జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతకీ జెన్సన్ హువాంగ్ జీవితంలోకి వచ్చిన ఆ ముగ్గురు మహిళలు ఎవరనేది చూద్దాం.

ఈ మొత్తం వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అలిస్ హువాంగ్. చైనాలోని ఒక చిన్న నగరం నుంచి మొదలైన ఆమె ప్రయాణం, అంతర్జాతీయ స్థాయిలో భారీ వ్యాపార నెట్‌వర్క్‌ను నిర్మించి.. చివరకు ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీ అధినేతకు అత్యంత సన్నిహితంగా మారడం వరకు ఎన్నో మలుపులు తిరిగింది. అలిస్ అసలు పేరు ‘హువాంగ్ లే’ అని సమాచారం. అమెరికా నిఘా వర్గాల అనుమానం ప్రకారం జెన్సన్ హువాంగ్‌కు దగ్గరయ్యేందుకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఆమెను ప్రత్యేకంగా నియమించుకుంది. అయితే చైనా ఈ ఆరోపణలను ఖండించింది. అలిస్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి నేరారోపణలు నమోదు కాలేదు.

Also Read : 23 ఏళ్ల అమెరికా చరిత్రను తిరగరాసిన ట్రంప్.. ఏ విషయంలోనో తెలుసా?

1977లో చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో అలిస్ జన్మించారు. నర్సింగ్ చదివిన ఆమె, ఆ తర్వాత హునాన్ టీవీతో పాటు చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో పనిచేశారు. అయితే ఆ సంస్థల్లో ఆమె ఎప్పుడూ రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేయకపోవడం గమనార్హం. జెన్సన్ హువాంగ్‌ను కలవకముందే అలిస్‌కు వివాహమైంది. ఆ తర్వాత ఆమెకు స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు, ఇన్వెస్టర్ అయిన కాంగ్ వీతో పరిచయం ఏర్పడింది. 2010 ప్రాంతంలో చైనా వీడియో గేమ్ కంపెనీల కొనుగోలు సమయంలో కాంగ్ వీకి, జెన్సన్ హువాంగ్‌కు వ్యాపార పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయంతోనే కాంగ్ వీ తన భార్య అలిస్‌ను జెన్సన్‌కు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. 2023 నాటికి అలిస్ సింగపూర్‌కు చెందిన ‘మెగాస్పీడ్’ అనే కంపెనీలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లోని డేటా సెంటర్ల కోసం ఎన్వీడియా నుంచి బిలియన్ల డాలర్ల విలువైన చిప్‌లను కొనుగోలు చేసే వ్యాపారంలో ఈ సంస్థ కీలకంగా ఉండేది. నిషేధిత ఎన్వీడియా చిప్‌లను చైనాకు అక్రమంగా తరలించడంలో మెగాస్పీడ్ సహకరించిందనే ఆరోపణలు రావడంతో అమెరికా, సింగపూర్ దేశాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయి.

జెన్సన్ హువాంగ్‌తో సంబంధం ఉన్నట్లు చర్చ జరుగుతున్న రెండో మహిళ పేరు కింబర్లీ పావెల్. ఈమె బయటి వ్యాపారవేత్త కాదు. స్వయంగా ఎన్వీడియా సంస్థలోనే ఒక సీనియర్ అధికారిణి. గత 18 ఏళ్లుగా ఎన్వీడియాలో పనిచేస్తున్న కింబర్లీ, కంపెనీలోని హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో ఎన్వీడియాలో డైరెక్టర్‌గా చేరిన ఆమె, తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. వైద్య రంగంలో ముఖ్యంగా మెడికల్ ఇమేజింగ్ విభాగంలో ఎన్వీడియా రూపొందించిన ఏఐ చిప్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

మార్చి నెలలో కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగిన కంపెనీ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ సమయంలో జెన్సన్ హువాంగ్, కింబర్లీ ఒకే హోటల్‌లో అత్యంత సన్నిహితంగా కనిపించారని తెలుస్తోంది. ఎన్వీడియాకు చెందిన ఐదుగురు ప్రస్తుత, మాజీ ఉద్యోగుల సమాచారం మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి సాన్నిహిత్యం అక్కడి కెమెరాల్లో కూడా రికార్డు అయినట్లు ఇద్దరు ఉద్యోగులు తెలిపారు. కింబర్లీ నేరుగా జెన్సన్ హువాంగ్‌కే రిపోర్ట్ చేసే అధికారిణి కావడంతో ఈ అంశం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇక జెన్సన్ హువాంగ్ జీవితంలో ఉన్న మూడో మహిళ పేరు గానీ, ఇతర వివరాలు గానీ ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. మొత్తంగా ముగ్గురు మహిళలతో జెన్సన్ హువాంగ్‌కు సంబంధాలు ఉన్నట్లు బయటపడటం ఆయన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. ఎన్వీడియా సహ-స్థాపకుడిగా సుమారు 33 ఏళ్ల పాటు సంస్థను ముందుండి నడిపించి, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ చిప్ కంపెనీగా తీర్చిదిద్దిన జెన్సన్ హువాంగ్ ఈ వివాదంలో చిక్కుకున్నారు.

Also Read : ఎన్విడియాకు భారీ షాక్.. సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై వివాదాస్పద ఆరోపణలతోరూ.23 లక్షల కోట్లు స్వాహా!