ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ చైనా గూఢచారి మహిళతో అఫైర్ సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు, అలాగే చైనా గూఢచారిగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘మెగాస్పీడ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకురాలు ఆలిస్ హువాంగ్ తన స్వదేశమైన చైనాకు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భద్రతా అధికారుల అనుమతితో బీజింగ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ ఇటీవల తన వివాహేతర సంబంధాన్ని అంగీకరించడం, ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి అనే ఆరోపణలపై కంపెనీ బోర్డు విచారణ ప్రారంభించడంతో ఆమె ఆచూకీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం ప్రపంచ మార్కెట్లను కుదిపేయడమే కాకుండా.. జెన్సన్ హువాంగ్ సీఈవో పదవికే ఎసరు తెచ్చే ప్రమాదం ఏర్పడింది. అయితే ఆలిస్ హువాంగ్ ఎప్పుడు, ఎందుకు బీజింగ్ వెళ్లారు, ప్రస్తుతం అక్కడ ఏం చేస్తున్నారనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మరోవైపు ఆమె గూఢచారి అనే ఆరోపణలను చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

Also Read : పదేళ్లలో కేన్సర్, అల్జీమర్స్‌ మాయం? AI శాస్త్రవేత్తల రియాలిటీ చెక్!

‘హువాంగ్ లే’గా కూడా పిలిచే ఆలిస్ హువాంగ్ గతంలో జర్నలిస్టుగా ఆ తర్వాత ఫైనాన్స్ రంగంలో హెచ్‌ఎస్‌బిసి, సిటిక్ సెక్యూరిటీస్ వంటి సంస్థల్లో పనిచేశారు. అనంతరం 2023లో ఆగ్నేయాసియా కేంద్రంగా ‘మెగాస్పీడ్’ సంస్థను స్థాపించారు. అప్పట్లో అమెరికా ప్రభుత్వం చైనాకు అధునాతన ఏఐ చిప్‌ల ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించిన కొద్ది నెలలకే ఈ కంపెనీ ఏర్పడింది. అనతికాలంలోనే మెగాస్పీడ్ ఆగ్నేయాసియాలో ఎన్విడియా చిప్‌లను కొనుగోలు చేసే అతిపెద్ద సంస్థగా, అధికారిక ఎన్విడియా క్లౌడ్ పార్టనర్‌గా ఎదిగింది.

2023లో మెగాస్పీడ్ సంస్థ తన వద్ద ఉన్న నగదు నిల్వల కంటే వెయ్యి రెట్లకు పైగా విలువైన అంటే సుమారు 4.6 బిలియన్ డాలర్లకు పైగా ఎన్విడియా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆగ్నేయాసియా మార్గం ద్వారా ఎన్విడియా అధునాతన హార్డ్‌వేర్‌ను చైనాలోకి అక్రమంగా తరలించడానికి ఈ సంస్థ ఒక ప్రధాన కేంద్రంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చైనా సైన్యంతో సంబంధాలున్నాయని అమెరికా అనుమానిస్తున్న ప్రముఖ సంస్థ అలీబాబా గ్రూప్‌కు కూడా మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియా చిప్‌లను అద్దెకు ఇస్తున్నట్లు తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అటు ఎన్విడియా బోర్డు విచారణ కొనసాగుతుండగానే.. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆలిస్ హువాంగ్ చైనాకు చేరుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : ఎన్విడియా సీఈఓ చైనా గూఢచారి వివాదం.. ట్రంప్‌కు ముందే తెలుసా? అసలు నిజమేంటంటే?