దేశంలో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కోర్టుల్లో ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలను వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ‘ఈవెనింగ్ కోర్టులు’ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఒక మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Also Read : జమ్మూకశ్మీర్‌లో CRPF జవాన్లపై ఉగ్రవాదుల కాల్పులు

పైలట్ ప్రాజెక్ట్‌గా 3 రాష్ట్రాల్లో అమలు

ఈ నూతన విధానాన్ని ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బిహార్‌లలో ప్రారంభించనున్నారు. సాధారణంగా కోర్టులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్దిష్ట సమయాల్లో పనిచేస్తాయి. అయితే ఈ కొత్త ప్లాన్ ప్రకారం, రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ ముగిసిన తర్వాత సాయంత్రం వేళల్లో అదనంగా కొన్ని గంటల పాటు కోర్టులు పనిచేస్తాయి.

రిటైర్డ్ జడ్జిల సేవలు వినియోగం

ఈ ఈవెనింగ్ సెషన్లలో కేవలం పేరుకుపోయిన పాత బ్యాక్‌లాగ్ కేసులను మాత్రమే విచారించేలా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రస్తుత జడ్జిలపై పనిభారం పడకుండా ఉండేందుకు రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సంబంధిత రాష్ట్రాల హైకోర్టులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు.

Also Read : క్యాన్సర్‌ రోగులకు బిగ్‌ రిలీఫ్‌.. కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గిన ఈ మందుల ధరలు!

ఫలితాలను బట్టి దేశవ్యాప్తంగా విస్తరణ

ఈ మూడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ పనితీరు, కేసుల డిస్పోజల్ రేటును సమీక్షించిన తర్వాత, దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు.

ఈవెనింగ్ కోర్టులతో పాటు న్యాయవ్యవస్థపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్‌లను బలోపేతం చేయడం, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ADR), ప్రీ-మీడియేషన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టు దాకా రాకముందే సమస్యలను పరిష్కరించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో న్యాయం అందక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఊరట కలిగించే అంశం.