దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వేలాది మంది రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప వరాలాంటి నిర్ణయాన్ని ప్రకటించింది. నిత్యం విపరీతంగా పెరిగిపోతున్న వైద్య ఖర్చులతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా 137 రకాల కీలకమైన క్యాన్సర్ వ్యతిరేక మందుల ధరలను గణనీయంగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా మన దేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న కుటుంబాలకు వ్యాధి తెచ్చే మానసిక వేదన కంటే ఆసుపత్రి బిల్లులు, మందుల కొనుగోలు తెచ్చే ఆర్థిక భారమే కొండంత సమస్యగా మారుతోంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతోమంది తమ ఆస్తులను అమ్ముకుని, అప్పులపాలై తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తరుణంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

క్యాన్సర్ చికిత్సకు వాడే మందుల ధరలు మార్కెట్లో ఆకాశాన్నంటడానికి అసలు కారణం ఔషధాల తయారీ వ్యయం కాదని, తయారీదారుల నుంచి రోగి చేతికి చేరే మధ్యలో ఉండే వివిధ స్థాయిల వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు వేసుకునే విపరీతమైన లాభాలేనని తెలుస్తోంది. ఈ అక్రమ లాభాల దందాను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ ప్రాణాంతక వ్యాధి మందులపై 30 శాతం ట్రేడ్-మార్జిన్ క్యాప్ నిబంధనను తక్షణమే అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం సరఫరాదారు లేదా విక్రేత తమ ఇష్టారాజ్యంగా లాభాలను పెంచి అమ్మడానికి వీలుండదు. ఫలితంగా నాన్-షెడ్యూల్డ్ కేటగిరీకి చెందిన 137 రకాల క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరలు సగటున 70 శాతం వరకు తగ్గుముఖం పట్టనున్నాయి. కొన్ని ప్రధాన బ్రాండెడ్ మందులప అయితే ఈ తగ్గింపు ఏకంగా 90 శాతానికి పైగా ఉండబోతోందని మార్కెట్ రంగానికి చెందిన విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read : దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీ, హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. నగరాలను కమ్మేసిన విష కాలుష్యం!

కేంద్ర ఫార్మాస్యూటికల్స్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కఠిన ధరల నియంత్రణ చర్యల వల్ల దేశంలోని క్యాన్సర్ రోగులకు ప్రతి ఏటా సుమారు రూ.3,500 కోట్లకు పైగా సొమ్ము ఆదా కానుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తగ్గించిన కొత్త ధరలు ఇప్పటికే మార్కెట్లో అధికారికంగా అమల్లోకి వచ్చాయి. క్యాన్సర్ బాధితులకు తరచుగా అందించే అత్యంత ఖరీదైన కీమోథెరపీ ఇంజెక్షన్లు, వ్యాధి కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే టార్గెటెడ్ థెరపీ మాత్రలు, శరీర రోగనిరోధక శక్తిని పెంచే అత్యాధునిక ఇమ్యునోథెరపీ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ భారీ ధరల తగ్గింపు జాబితాలో ఉన్నాయి.

ప్రభుత్వం తగ్గించిన ఈ లబ్ధి నేరుగా రోగులకు అందేలా చూసేందుకు పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. రోగులు లేదా వారి కుటుంబ సభ్యులు తాము కొనుగోలు చేసే మందుల సరికొత్త తగ్గించబడిన MRP ధరలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫార్మా సహీ దామ్’ అనే మొబైల్ యాప్‌ ద్వారా కూడా మందుల అసలు ధరలను సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

మరోవైపు ధరలు విపరీతంగా తగ్గాయనే నెపంతో ఔషధ తయారీ కంపెనీలు లేదా డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్లో సదరు క్యాన్సర్ మందుల ఉత్పత్తిని లేదా సరఫరాను తగ్గిస్తే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఆసుపత్రి, మెడికల్ షాపుల్లో ఈ 137 రకాల మందుల కొరత ఏర్పడకుండా నిరంతరం సరఫరా కొనసాగేలా ఎన్‌పీపీఏ ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసింది. ఒకవేళ లాభాలు తగ్గాయని ఏ కంపెనీ అయినా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే సదరు ఔషధ సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read : కళ్లు మూసుకుంటే లక్షలు.. జాక్‌పాట్ కొట్టేసిన ముంబై యువతి.. ఇంతకీ ఏం చేసిందంటే?