
చలికాలం వచ్చేసింది. ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతిఒక్కరూ ఈ సీజన్లో సమస్యల బారిన పడతుంటారు. అయితే ముందస్తుగా కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అనారోగ్యం నుంచి ఈజీగా బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి ఇళ్లల్లోని వంటింట్లో దొరికే వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందులో ముందువరుసలో ఉండేది పసుపు. ఈ పదార్థం ఇమ్యూనిటీ పెంచడంలో బాగా సహాయపడుతుంది. బ్యాక్టిరియాను తరిమికొట్టడంలో సూపర్పౌడర్గా పనిచేస్తుంది. జలుబు, దగ్గు ఉంటే.. గోరు వెచ్చని పాలలో లైట్‌గా పసుపు కలుపుకుని తాగితే బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
దాల్చిన చెక్క
ఈ దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని వంటల్లో గుమగుమలాడే సువాసన, రుచి కోసం ఉపయోగిస్తుంటారు. ఇది చలికాలంలో షుగర్ పేషెంట్లకు బాగా మేలు చేస్తుంది. నోటి దుర్వాసనలను దూరం చేయడమే కాకుండా.. శరీరం చురుగ్గా ఉంటుంది.
తగినంత నీరు తాగడం
చలికాలంలో పెద్దగా దాహం వేయదు. దీనివల్ల చాలామంది నీరు తాగడం ఆపేస్తారు. ఇది డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. అందువల్ల చలికాలంలో అయినా శరీరానికి తగినంత నీరు తాగాలి. ముఖ్యంగా ఈ సీజన్లో నీటిని వేడి చేసుకుని తాగడం అత్యంత శ్రేయస్కరం. వేడినీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గొంతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
ఈ సీజన్లో వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా మారుతుంది. తరచూ ఇలా చేయడం వల్ల చలి అనిపించకుండా ఉంటుంది.
వేడి పదార్థాలు
ఉదయం పూట గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి వాటిని వంటల్లో ఎక్కువగా వాడాలి. ఇవి శరీరానికి వేడిని ఇవ్వడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి.
గొంతు ఇన్ఫెక్షన్కు చెక్
చలికాలంలో గొంతు నొప్పి, గొంతు గరగర అనేది సాధారణ సమస్యే. అయినప్పటికీ దీన్ని ప్రారంభ దశలోనే తగ్గించుకోవడం ముఖ్యం. దీనికోసం కొద్దిగా ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో రోజుకు రెండు, మూడు సార్లు పుక్కిలించడం వల్ల గొంతులోని బ్యాక్టీరియా చనిపోయి.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
సరైన బట్టలు వేసుకోవడం
ఉదయం, సాయంత్రం చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు చెవులు, ముక్కు కప్పుకునేలా వేడిగా ఉండే స్వెటర్లు, మఫ్లర్లు వేసుకోవాలి. దీనివల్ల చల్లటి గాలి నుంచి ఉపశమనం పొందొచ్చు.









