Rahul Gandhi : కర్ణాటకలోని పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న ఇంధనంలో ఇథనాల్ పరిమితికి మించి కలుపుతున్నారనే వార్తలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘E20’ ప్రోగ్రామ్ కాస్తా ప్రజలను మోసం చేసే ‘420’ కార్యక్రమంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. నిర్ణీత పరిమితిని దాటి ఇథనాల్‌ కలపడం అంటే సామాన్య ప్రజల కార్ల ట్యాంకుల నుంచి నేరుగా పెట్రోల్‌ను దొంగిలించడమేనని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : దీపావళికి పటాకులు కాలిస్తే 6 నెలలు జైలు, లక్ష ఫైన్.. సర్కార్ సంచలన చట్టం!

కర్ణాటకలోని పలు జిల్లాల నుంచి సేకరించిన శాంపిల్స్ ల్యాబ్ టెస్ట్ రిపోర్టులను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బెంగళూరు, కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, మంగళూరు, తుమకూరు పరిధిలోని బంకుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఇథనాల్ కాన్సంట్రేషన్ ఏకంగా 30.5% నుంచి 31.2% వరకు ఉన్నట్లు తేలిందన్నారు. రికగ్నైజ్డ్ ల్యాబ్‌లో టెస్ట్ చేసిన మొత్తం 14 శాంపిల్స్‌లో 11 శాంపిల్స్‌ నిబంధనల కంటే ఎక్కువగా 20 శాతానికి పైగా ఇథనాల్‌ను కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు.

“ప్రజల కార్లు, బైకుల ఇంధన ట్యాంకుల్లో అసలు ఏం నింపుతున్నారో ప్రధాని మోదీ ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి” అని రాహుల్ డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ ఇథనాల్ కలుపుతున్న ఆయిల్ కంపెనీలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని, ఈ వ్యవహారం ద్వారా ఎవరి జేబులు నిండుతున్నాయో ప్రజలకు చెప్పాలని ఆయన నిలదీశారు. అంతకుముందు కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ కూడా రాష్ట్రంలో 30 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారని ఆరోపించారు.

కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన IOCL, BPCL, HPCL సంయుక్తంగా ఖండించాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెస్టింగ్ ప్రామాణికమైనది కాదని స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి తాము ఇథనాల్ పరిమాణాన్ని 19% నుంచి 21% మధ్య ఉండేలా అన్ని క్వాలిటీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంపెనీలు వెల్లడించాయి.

Also Read : జియో సంచలన ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 సంవత్సరాలు ఫ్రీ.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్..!