అమెరికాలోనే రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిత్య రామన్ విజయం సాధించారు. ప్రస్తుతం మేయర్‌గా ఉన్న 73 ఏళ్ల కరెన్ బాస్ పై నిత్య గెలుపొందారు. ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’ కథనం ప్రకారం.. నిత్య రామన్ 51.1% ఓట్లతో ముందంజలో ఉండగా, కరెన్ బాస్ 48.33% ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

కేరళ నుంచి కార్పొరేటర్ స్థాయికి..

నిత్య రామన్ 1981లో కేరళలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు షిఫ్ట్ అయింది. 22 ఏళ్ల వయసులో అమెరికన్ సిటిజన్‌షిప్ పొందిన నిత్య.. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ప్రతిష్టాత్మక MIT నుంచి ‘అర్బన్ ప్లానింగ్’లో మాస్టర్స్ పూర్తి చేశారు. భారత్‌లో ‘ట్రాన్స్‌పరెంట్ చెన్నై’ అనే రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపించి పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు పనిచేశారు. 2013లో లాస్ ఏంజెల్స్‌కు మారిన తర్వాత హోమ్‌లెస్ సంక్షోభంపై పోరాడే ‘SELAH నైబర్‌హుడ్’ కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు, ‘టైమ్స్ అప్ ఎంటర్‌టైన్‌మెంట్’కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానం.. మేయర్ పోరు:

2020లో సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ సభ్యుడు డేవిడ్ ర్యును ఓడించి నిత్య రామన్ చరిత్ర సృష్టించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (DSA) మద్దతుతో కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి అభ్యర్థిగా నిలిచారు.

ఈసారి మేయర్ రేసులో నగర ఓటర్లు ప్రధానంగా నిరాశ్రయుల సమస్య (సుమారు 40% మంది ప్రాధాన్యం), పబ్లిక్ సేఫ్టీ, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం (30% మంది ప్రాధాన్యం) అంశాలపై దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గ్రీక్ థియేటర్ ప్లాజా వద్ద జరిగిన పార్టీలో నిత్య రామన్ మాట్లాడుతూ.. ఫలితాలపై చాలా ఆశాభావంతో ఉన్నానని, అయితే కౌంటింగ్ ముగిసేవరకు సంయమనం పాటించాలని మద్దతుదారులను కోరారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, లాస్ ఏంజెల్స్ చరిత్రలోనే ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా నిత్య సరికొత్త రికార్డు సృష్టిస్తారు.