దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇల్లు వెలుగులతో, లక్ష్మీదేవి పూజలతో పాటు రకరకాల తీపి పదార్థాల సువాసనలతో నిండిపోతుంది. చుట్టాలకు, స్నేహితులకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకుంటారు. అయితే పండుగ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు కల్తీ, నకిలీ స్వీట్లను మార్కెట్లోకి వదులుతుంటారు. నిగనిగలాడే ఆ రంగుల స్వీట్లను చూసి మనం ఆశగా కొనుగోలు చేస్తాం. కానీ వాటి తయారీలో వాడే రసాయనాలు, నాణ్యత లేని పదార్థాలు మన కడుపులోకి వెళ్తే తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. మరి మనం కొనే స్వీట్లు అసలైనవో కాదో ఇంట్లోనే సులభంగా గుర్తించడం ఎలాగో చూద్దాం.

Also Read : జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.1000లకే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్..!

నకిలీదో కాదో ఎలా చూడాలి?

కాజు కట్లీ, లడ్డూలు, హల్వాల పైన మెరిసే వెండి రేకు అందంగా కనిపిస్తుంది. కానీ చాలామంది వెండి రేకుకు బదులుగా చౌకగా లభించే అల్యూమినియం రేకును ఉపయోగిస్తుంటారు. అల్యూమినియం కడుపులోకి వెళ్తే కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతింటాయి. దీనిని పరీక్షించడానికి స్వీట్ పైనున్న వెండి రేకును వేలితో కొద్దిగా తాకి నలపాలి. అది నిజమైన వెండి రేకు అయితే వేలికి అంటుకుని వెన్నలా కరిగిపోతుంది. అదే అల్యూమినియం అయితే నలిగినప్పుడు ముద్దగా మారడమే కాకుండా వేలికి అంటుకోదు. అలాగే వెండి రేకును తీసి నిప్పుపై కాల్చితే నిజమైన వెండి మెరిసే చిన్న బంతిలా మారుతుంది. అల్యూమినియం అయితే నల్లగా మారి బూడిదలా మసిపోతుంది.

ఖోయా, మావా

కోవా లేదా మావాతో చేసే స్వీట్లలో సబ్బు పొడి, డిటర్జెంట్, స్టార్చ్, నాణ్యత లేని నూనెలను కలిపి ఫేక్ ఖోయా తయారుచేస్తారు. దీనిని గుర్తించడానికి అయోడిన్ పరీక్ష చేయవచ్చు. కొద్దిగా కోవా లేదా ఆ స్వీట్‌ను నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత అందులో 2-3 చుక్కల అయోడిన్ సొల్యూషన్ వేయాలి. ఆ మిశ్రమం నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కల్తీ జరిగిందని అర్థం. అలాగే కొద్దిగా కోవాను బొటనవేలితో రుద్ది చూస్తే.. నిజమైనదైతే నెయ్యి వాసన వస్తూ చేతికి ఆయిల్ అంటుకుంటుంది. కల్తీ కోవా అయితే గట్టిగా, రబ్బరులా అనిపిస్తుంది.

నెయ్యి, నూనెల్లో కల్తీ

స్వీట్ల సువాసనకు ప్రధాన కారణం నెయ్యి. అయితే స్వచ్ఛమైన నెయ్యికి బదులు డాల్డా లేదా పామాయిల్ వాడి స్వీట్లు తయారుచేస్తుంటారు. స్వీట్ కొద్దిగా నోట్లో వేసుకోగానే కొవ్వు గొంతులో అతుక్కుపోయినట్లు అనిపిస్తే అది డాల్డా లేదా తక్కువ రకం నూనె అని గ్రహించాలి. అలాగే నెయ్యి మాదిరి ఉన్న పదార్థానికి కొద్దిగా పంచదార, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే అది ఎరుపు రంగులోకి మారితే అందులో వనస్పతి కలిపారని స్పష్టమవుతుంది.

కృత్రిమ రంగులు

జిలేబీ, లాడూ, హల్వా వంటి స్వీట్లకు ఆకర్షణీయమైన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు రావడానికి హానికరమైన కెమికల్స్ వాడుతుంటారు. ఈ రంగులు క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు దారితీస్తాయి. దీనిని తెలుసుకోవడానికి స్వీట్ ముక్కను కొద్దిగా తీసుకుని చేతిలో పట్టుకుని కొన్ని నీటి చుక్కలు వేసి రుద్దాలి. ఆ రంగు చేతులకు గట్టిగా అంటుకుని వదలకుంటే అది కెమికల్ రంగు. నిజమైన ఆహారపు రంగులు నీటితో సులభంగా పోతాయి. చేతికి అతుక్కోవు.

Also Read : స్మార్ట్‌ఫోన్‌పై రూ.15 వేల భారీ డిస్కౌంట్.. ఇది కదా ఆఫరంటే..!

పాలు, పనీర్ కల్తీ

రసగుల్లా, రసమలై వంటి స్వీట్లను పాలతో, పనీర్‌తో తయారు చేస్తారు. వీటిలో రసాయనాలు కలిపిన ఫేక్ పాలను వాడే అవకాశం ఉంది. పనీర్ స్వీట్ ముక్కను నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత అయోడిన్ చుక్కలు వేస్తే అది నీలం రంగులోకి మారితే కల్తీ పనీర్ అని గుర్తించవచ్చు. అంతేకాకుండా కల్తీ పనీర్ లేదా పాల స్వీట్లు తింటున్నప్పుడు రబ్బరులా సాగుతాయి, సులభంగా నమలలేము.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్వీట్ బాక్స్ కొనే ముందు ఉత్పత్తి తేదీ, వాడాల్సిన గడువు చూడాలి. ముదురు రంగుల్లో మెరిసిపోయే స్వీట్ల కంటే సాధారణ రంగుల్లో ఉండే సాంప్రదాయ స్వీట్లకే ప్రాధాన్యత ఇవ్వండి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన దుకాణాలు, నమ్మకమైన పాత స్వీట్ షాపుల్లోనే కొనుగోలు చేయండి.