
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని ప్రయత్నించి కటకటాలపాలవుతుంటారు. అలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో చలామణి అవుతున్న ఫేక్ రూ.20 నాణేల తయారీ, సరఫరా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరిగిన ఒక టయోటా కారును అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. కారులోని వెనుక సీటులో ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన ఫేక్ రూ.20 నాణేలను గుర్తించారు. ఇందులో భాగంగా మొత్తం 50 పాలిథీన్ ప్యాకెట్లను స్వాధీనం చేసున్నారు.
ఆ పది ప్యాకెట్లలో 100 నాణేల చొప్పున మొత్తం 5,000 నాణేలు ఉన్నట్లు గుర్తించారు. అవి ఒక రూ.లక్షగా అంచనా వేశారు. అనంతరం ఆ ఫేక్ కరెన్సీతో పాటు పారస్ జైన్ అనే నిందితుడ్ని పోలీసులు సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆపై నిందితుడ్ని విచారించగా.. ఫేక్ నాణేల తయారీ, సరఫరా వెనుకున్న ప్రధాన సూత్రధారి గురించి చెప్పేశాడు.
ఉపకర్ లూత్రా అలియాస్ అభయ్ ప్రతాప్ సింగ్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మరో ముగ్గురి పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ విచారణలో మరికొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. దాదాపు రూ.1లక్ష విలువ కలిగిన నాణేలను ఈ ముఠా మార్కెట్లో కేవలం రూ.70వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా నిందితులు తమ అక్రమ తయారీ కేంద్రాలను తరచూ మారుస్తూ ఉండేవారని వెల్లడైంది. ఈ దాడిలో పోలీసులు ఒక కారు, ఐఫోన్, ల్యాప్ టాప్ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.









