
ల్యాబ్‌లో కృత్రిమ వజ్రాలను తయారు చేయడం మనం ఇప్పటికే చూశాం. కానీ, ఎవరైనా ల్యాబ్‌లో బంగారాన్ని తయారు చేస్తామంటే నమ్ముతారా? ఇప్పుడు సైన్స్ ప్రపంచంలో సరిగ్గా ఇదే నిజమైంది. అత్యాధునిక న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో పాదరసాన్ని ప్యూర్ బంగారంగా మార్చినట్లు శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ మారథాన్ ఫ్యూజన్ ప్రకటించింది.
ఈ అద్భుతానికి సైంటిస్టులు ఉపయోగించిన పద్ధతిని న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యుటేషన్ అంటారు. సాధారణ కెమికల్ రియాక్షన్స్ కేవలం మూలకాల రూపురేఖలను మాత్రమే మారుస్తాయి తప్ప వాటి ప్రాథమిక లక్షణాన్ని మార్చలేవు. కానీ న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా పరమాణు కేంద్రకంలోనే మార్పులు చేసి, ఒక మూలకాన్ని పూర్తిగా మరో మూలకంగా మార్చడం సాధ్యమవుతుంది.
ఈ ప్రయోగంలో పరిశోధకులు పాదరసానికి చెందిన స్థిరమైన ఐసోటోప్ అయిన మెర్క్యురీ-198ను ఉపయోగించారు.
ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి అయిన అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్లతో మెర్క్యురీ-198ను ఢీకొట్టిస్తారు.
దీనివల్ల అది తాత్కాలికంగా మెర్క్యురీ-197 అనే రేడియోయాక్టివ్ ఐసోటోప్‌గా మారుతుంది.
ఈ రేడియోధార్మికత కారణంగా అది క్షీణించి, చివరికి సహజమైన, స్థిరమైన అసలైన గోల్డ్-197 మూలకంగా స్థిరపడుతుంది.
సెర్న్ (CERN) కంటే 10 రెట్లు వేగంగా… ఐరోపా అణు పరిశోధక సంస్థ (CERN) గతంలో సూచించిన ప్రామాణిక వేగం కంటే, తాము అభివృద్ధి చేసిన పద్ధతి ద్వారా ఏకంగా 10 రెట్లు ఎక్కువ వేగంతో బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగామని మారథాన్ ఫ్యూజన్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ ప్రయోగం ప్రస్తుతం ల్యాబ్ స్థాయిలోనే ఉంది. దీని కమర్షియల్ ప్రొడక్షన్, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, భద్రతా ప్రమాణాలు ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అయినప్పటికీ, భవిష్యత్తులో మూలకాల సృష్టికి మరియు మెటీరియల్ సైన్స్‌కు ఈ ఆవిష్కరణ ఒక సరికొత్త మార్గాన్ని చూపిస్తుందనడంలో సందేహం లేదు.









