
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,453 వార్డుల పరిధిలో 96,89,061 మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 21,39,625 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటున 22.08 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం కాస్త ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండటంతో పోలింగ్ శాతం పుంజుకుంది.
ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ముఖ్యంగా కడప జిల్లా పులివెందులలో ఎన్నికల వేడి అర్థరాత్రి నుంచే ప్రారంభమైంది. ఓ శుభకార్యానికి వచ్చిన వారి వాహనాలపై దాడులు చేసి మూడు కార్లు, ఒక ట్రాక్టర్‌ను నిప్పంటించి తగలబెట్టాయి. అలాగే మాజీ సీఎం జగన్ పులివెందులకు చెరగా.. హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కు పర్మిషన్ను చివరి నిమిషంలో ఆపేశారు. నిన్న హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో ఒక్కసారిగా మాట మార్చారు.
మధ్యాహ్నం 2.30 తర్వాతే హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతిస్తామంటూ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది. మొదట జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇచ్చినా.. ఆయన వస్తే ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశముందని కడప ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ అనుమతిని తిరస్కరించారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా జోక్యం చేసుకోవడంతో చివరకు వైఎస్ జగన్ పులివెందులలో హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి పర్మిషన్ అందినట్లు తెలుస్తోంది.
పులివెందుల 31వ వార్డులో పోలింగ్ కేంద్రానికి అవసరమైన పత్రాలతో బూత్‌లోకి వెళ్తున్న వైసీపీ మహిళా ఏజెంట్ సునందపై దాడి జరిగింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బూత్ వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. పులివెందులలోని 38వ వార్డు సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి రణరంగాన్ని తలపించింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం కనుసైగలతో హెచ్చరించుకుంటూ దాడులకు దిగారు. అలాగే అనంతపురం 35, 38, 40వ డివిజన్లలో స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని వైసీపీ నేతలు అడ్డుకోవడంతో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది.
కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ను వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేశావంటూ జగన్‌పై దస్తగిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాన్వాయ్ ఎదుట నిరసనకు యత్నించారు. నేరుగా జగన్ వాహనం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో దస్తగిరి వచ్చాడంటూ జగన్‌కు సమాచారం అందించినప్పటికీ ఆయన దస్తగిరిని పట్టించుకోలేదు. గతంలోనూ జగన్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ కార్పొరేషన్ 55వ డివిజన్లో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో గుర్తులు తారుమారు కావడం తీవ్ర కలకలం రేపింది. బ్యాలెట్ పేపర్లో వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషాకు ‘చేయి’ గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్‌కు ‘ఫ్యాన్’ గుర్తు కేటాయించారు. ఆర్వో విడుదల చేసిన ఫారం-11లో గుర్తులు సరిగ్గానే ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్లో మాత్రం భిన్నంగా ఉండటంపై ఇరు పార్టీల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అని నిలదీస్తూ వైసీపీ అభ్యర్థి ఆర్వోను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలింగ్‌ను వెంటనే నిలిపివేశారు. ఆర్వో చక్రవర్తి ఆదేశాల మేరకు కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించడానికి చర్యలు చేపట్టగా.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక సుమారు 2 గంటలు ఆలస్యంగా పోలింగ్ పునఃప్రారంభమైంది.









