Cyclone Arnab :  ఆర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, బలమైన గాలులతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పంటను బట్టి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు సాయం అందించనుంది. పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం అందించనున్నారు. చెరుకు పంటకు కూడా ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వనున్నారు.

సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున సాయం అందించనున్నారు. అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి పంటలతో పాటు కాఫీ, డ్రాగన్‌ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం ఇవ్వనున్నారు. కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌ పంటలకు ఎకరాకు రూ.25 వేల సాయం అందుతుంది. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇవ్వనున్నారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున సాయం అందించనున్నారు.

Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: DA 3 శాతం పెంపు

ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర వంటి పంటలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని తెలిపారు. అరటి, బొప్పాయి తోటల్లో చెట్లకు ఊతం ఇవ్వాలని, కూరగాయల పొలాల్లో నీరు నిలవకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌, మామిడి తోటలను కూడా బలమైన గాలుల నుంచి కాపాడుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పారు.

తుఫాన్‌ ప్రభావం తగ్గిన తర్వాత పంటలు, తోటలకు జరిగిన నష్టాన్ని గ్రామాల వారీగా అధికారులు పరిశీలించనున్నారు. నష్టం జరిగిన రైతులు పంట నష్టానికి సంబంధించిన ఫొటోలు, ఇతర వివరాలను భద్రపరచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఉల్లి, షుగర్, బంగాళదుంప కిలో చొప్పున ఫ్రీగా ఇస్తామని తెలిపారు. ఇళ్లలో నీరు చేరిన వారికి 25 కేజీల బియ్యం ఇస్తామన్నారు, చనిపోయిన వారికి రూ.5లక్షలు, ఇల్లు పాక్షికంగా డ్యామేజీ అయితే రూ.10వేలు, షాపులు దెబ్బతింటే రూ.25 వేలు. టూవీలర్ డ్యామేజీకి రూ.3వేలు, త్రీవీలర్‌కి రూ.10వేలు ఇస్తామని వెల్లడించారు. స్పెషల్ అసిస్టెన్స్ కింద క్యాంపులకు వచ్చిన ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున ఇస్తామని తెలిపారు.

Also Read : జియో దెబ్బకు టాటా గ్రూప్ వెనక్కి.. రూ. 30.5 లక్షల కోట్లతో అంబానీ రికార్డు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.