ఇజ్రాయెల్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి, ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైనికధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని మార్పు కూటమి మధ్య అత్యంత తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో 120 స్థానాలు కలిగిన ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో అధికారాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 61 సీట్ల మెజారిటీ అవసరం కాగా.. రెండు ప్రధాన కూటములు కూడా ఆ దాటలేకపోయాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

తాజా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ ప్రకారం ప్రధాని నెతన్యాహుకి చెందిన ‘లికుడ్’ పార్టీ సుమారు 27 శాతం ఓట్లతో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించే అవకాశం ఉంది. అయితే ఆయన నేతృత్వంలోని మితవాద సంకీర్ణ కూటమి మొత్తంగా దాదాపు 51 సీట్లను మాత్రమే సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కూడా సరిగ్గా 51 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్‌లోని మిగిలిన 18 స్థానాలను అరబ్ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు గెలుచుకున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. తొలి బ్యాలెట్ల లెక్కింపు ఫలితాలు , ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలిస్తే ఏ ఒక్క కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో దేశంలో మళ్లీ రాజకీయ ప్రతిష్టంభన తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : 24 గంటల్లో 5 భూకంపాలు.. అర్నాబ్ తుఫాన్ తెచ్చిన ప్రళయమా? సముద్రంలో ఏం జరుగుతోంది?

నెతన్యాహు కూటమి మెజారిటీ సాధించలేకపోవడానికి ప్రధానంగా కొన్ని అంశాలు దోహదం చేశాయని నిపుణులు భావిస్తున్నారు. తీవ్ర కుడిపక్ష పార్టీలతో నెతన్యాహు ఏర్పరచుకున్న పొత్తు పట్ల సాధారణ ఓటర్లలో వ్యక్తమైన నిరాశ అలాగే అతి-ఆర్థడాక్స్ యూదులకు సైనిక సేవ నుంచి మినహాయింపు ఇవ్వడంపై వ్యక్తమైన ప్రజాగ్రహం ఆయన కూటమికి ప్రతికూలంగా మారాయి. ప్రచార సమయంలో ఈ అంశాలు తీవ్ర చర్చనీయాంశమవడంతో ఆయన సొంత ఓటు బ్యాంకు కొంతమేర క్షీణించిందని విశ్లేషణలు చెబుతున్నాయి. 1999 తర్వాత అత్యంత రికార్డు స్థాయిలో దాదాపు 78 శాతం ఓటింగ్ నమోదు కావడం మార్పు కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడానికి సంకేతంగా ప్రత్యర్థులు అభివర్ణిస్తున్నారు.

పోలింగ్ అనంతరం మాట్లాడిన ప్రధాని నెతన్యాహు తమ లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచిందని త్వరలోనే బలమైన యూదు, జియోనిస్ట్ మెజారిటీతో మితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అరబ్ పార్టీల మద్దతుతో నడిచే ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, అలాంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన నేరుగా విజయాన్ని ప్రకటించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ మాట్లాడుతూ.. ఈ ఎగ్జిట్ పోల్స్ నెతన్యాహుపై ప్రజలకు ఉన్న విశ్వాస లేమిని స్పష్టంగా చూపుతున్నాయని అన్నారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, నెతన్యాహు తన ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం ఇరాన్‌పై యుద్ధ బెదిరింపులను వాడుకోవద్దని కూడా హెచ్చరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పడటానికి కొన్ని రాజకీయ మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది, ఐసెన్‌కోట్ నేతృత్వంలోని కూటమి అరబ్ పార్టీల మద్దతుతో లేదా వారి వెలుపలి సహకారంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అయితే అరబ్ చట్టసభ సభ్యులతో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి ఐసెన్‌కోట్ విముఖత చూపడం, అలాగే ఇతర మితవాద పార్టీలను దూరంచేసుకునే ప్రమాదం ఉండటంతో ఇది సవాలుతో కూడుకున్నది. రెండవది, ప్రధాన పార్టీలన్నీ కలిసి ఒక జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కానీ అతివాద నాయకుడు ఇటామర్ బెన్ గ్విర్ వంటి వారు ఈ ఐక్య ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఏ కూటమికి స్పష్టమైన అవగాహన కుదరకపోతే, దేశం మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు. తుది ఫలితాలు రాబోయే 48 గంటల్లో వెలువడనున్నప్పటికీ, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఇరాన్‌పై యుద్ధ నిర్ణయాల అధికారాలతో నెతన్యాహునే తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నారు.

Also Read : మాజీ మిస్ స్విట్జర్లాండ్‌‌పై.. డొనాల్డ్ ట్రంప్‌ అత్యాచారం!