
Israeli elections:ఇజ్రాయెల్ 26వ క్నెసెట్ (పార్లమెంట్) ఎన్నికల్లో ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి కొన్ని గంటల్లోనే గత 50 ఏళ్లకు పైగా కాలంలో ఎన్నడూ లేనంత భారీ ఓటింగ్ శాతం నమోదైంది. 2023 అక్టోబర్ 7 నాటి దాడుల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు, ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు లీడర్‌షిప్‌పై రెఫరెండంగా మారాయి. నెతన్యాహు ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్ర ఎన్నికల కమిటీ నివేదిక ప్రకారం, మధ్యాహ్నం 2 గంటల సమయానికే దాదాపు 44.9% మంది (సుమారు 32.9 లక్షల మంది) ఓటు వేశారు. దేశ చరిత్రలోనే ఇది ఆల్-టైమ్ రికార్డ్. మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన 31.5% పోలింగే గత 53 ఏళ్లలో అత్యధికం కాగా, ఆ తర్వాత అది మరింత పెరిగింది. సాధారణ పౌరులతో పాటు IDF సైనికులు కూడా భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకే 48% మంది సైనికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటర్ల రద్దీ విపరీతంగా పెరగడంతో ఎలక్షన్ కమిషన్ తన గైడ్‌లైన్స్‌ను అప్డేట్ చేసింది. పోలింగ్ బూత్ వద్ద ఒకరు ఓటు వేస్తుండగానే, తర్వాతి ఓటరు ఐడెంటిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించింది. రాత్రి 10 గంటల లోపు క్యూ లైన్లలో నిలబడిన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా యుద్ధానంతర దేశ భద్రత, జవాబుదారీతనం, ఆర్థిక వ్యవస్థ మరియు జీవన వ్యయం వంటి సమస్యలే కీలకంగా మారాయి. మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్కోట్తో నెతన్యాహు హోరాహోరీగా తలపడుతుండటంతో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టంగా మారింది. మొత్తం 120 సీట్లున్న క్నెసెట్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ (61 సీట్లు) రాని పరిస్థితుల్లో, ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టే అవకాశం ఉంది.









