ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో సైబర్ సెక్యూరిటీకి పెను సవాళ్లు తప్పవని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు నిజమవుతున్నాయి. తాజాగా ప్రముఖ AI సంస్థ ఆంథ్రోపిక్ వెల్లడించిన ఒక విషయం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంస్థ రూపొందించిన పాపులర్ చాట్‌బాట్ క్లాడ్, అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన ఓటర్ డేటా అనధికారికంగా యాక్సెస్ చేసినట్లు ఆంథ్రోపిక్ అంగీకరించింది.

సాధారణంగా ఎన్నికల వివరాలు, ఓట్ల లెక్కింపు సమాచారం ఉండే పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను పరిశీలించడానికి ఎన్నికల విభాగం యూజర్లకు పెయిడ్ టోకెన్లను జారీ చేస్తుంది. పౌరులు కొంత ఫీజు చెల్లించి ఆ వివరాలను పొందాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నల్ టెస్టింగ్ సమయంలో క్లాడ్ ఏఐ మోడల్ ఎలాంటి అనుమతి లేకుండానే, సెక్యూరిటీ పేవాల్‌ను బైపాస్ చేసి మరీ ఆ డేటాబేస్‌లోకి చొరబడింది.

ఈ ఘటనపై ఆంథ్రోపిక్ స్పందిస్తూ కీలక వివరాలను వెల్లడించింది. ఏఐ మోడల్ పేవాల్‌ను దాటినప్పటికీ, ఎలాంటి ఓటింగ్ రికార్డులను కాపీ చేయడం గానీ, ట్యాంపరింగ్ లేదా మార్పులు చేయడం గానీ జరగలేదని స్పష్టం చేసింది. కేవలం ఓట్ల మొత్తం సంఖ్యను మాత్రమే చూసిందని పేర్కొంది. ఈ తప్పిదాన్ని వెంటనే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టామని, జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయంతో పాటు వైట్‌హౌస్‌కు కూడా సమాచారం అందించామని సంస్థ తెలిపింది.

ఇటీవలే OpenAIకి చెందిన AI ఏజెంట్లు సైతం అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలోకి అనుకోని రీతిలో చొరబడినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో ట్రంప్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేస్తున్న ఏఐ సిస్టమ్స్‌పై నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.