
Lottery : యూఏఈలో 33 ఏళ్లుగా ఉంటున్న ఓ భారతీయుడికి అదృష్టం తలుపు తట్టింది. యూఏఈ లాటరీలో షార్జాకు చెందిన కిషోర్ పాండురంగ్ రావు రూ.12.95 కోట్ల భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అక్టోబర్ 3న జరిగిన లక్కీ డే డ్రాలో ఆయనకు రెండో బహుమతి కింద 5 మిలియన్ దిర్హామ్‌లు వచ్చాయి. కిషోర్ తన 60వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు ఈ లాటరీ గెలవడం విశేషం. కేవలం 50 దిర్హామ్‌లతో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ‘ఈజీ పిక్’ ఆప్షన్ ద్వారా నంబర్లు ఎంపిక చేసుకున్నారు. ఆరు నంబర్లు సరిపోవడంతో ఆయనకు రూ.12.9 కోట్ల బహుమతి దక్కింది.
అయితే ఒక్క నంబర్ తేడాతో రూ.30 మిలియన్ల జాక్‌పాట్‌ను మాత్రం మిస్ అయ్యారు. డ్రాలో వచ్చిన నెల నంబర్ 10 కాగా, అది కిషోర్ టికెట్‌లోని నంబర్‌తో సరిపోలలేదు. లాటరీ గెలిచిన విషయం మొదట కిషోర్‌కు నమ్మశక్యం కాలేదు. యూఏఈ లాటరీ నుంచి వచ్చిన ఈమెయిల్ చూసిన తర్వాత కూడా సాధారణ మెయిలేనని అనుకున్నారు. ఆ తర్వాత వార్తల్లో తన పేరు చూసి లాటరీ అకౌంట్ చెక్ చేయగా తాను గెలిచిన విషయం నిర్ధారించుకున్నారు.
ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పకుండా కొంతకాలం రహస్యంగా ఉంచారు. చివరికి భార్యకు చెప్పడంతో ఆమె చాలా సంతోషించింది. ఈ వార్తను కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాత్రమే పంచుకున్నారు. తన కుటుంబాన్ని యూఏఈలో ఒకచోట చేర్చుకోవడమే ఇప్పుడు తన ప్రధాన లక్ష్యమని కిషోర్ చెప్పారు. పెద్ద కొడుకు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేయాలని, చిన్న కొడుకు ఉన్నత చదువులు చదివేందుకు డబ్బు ఉపయోగించాలని భావిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా తనకున్న మరో కోరికను కూడా ఇప్పుడు నెరవేర్చుకోవాలని కిషోర్ భావిస్తున్నారు. యూఏఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1993లో తొలిసారి యూఏఈకి వచ్చిన కిషోర్.. దుబాయ్, అజ్మాన్, షార్జా, అబుదాబిలో నివసించారు. 30 ఏళ్లకు పైగా యూఏఈలోనే ఉంటున్న ఆయన.. ఇక తన భార్యతో కలిసి ప్రపంచం మొత్తం చుట్టి రావాలని కోరుకుంటున్నారు.
లాటరీ గెలిచిన ఆనందంలో ఉన్నప్పటికీ ఇతరులకు కిషోర్ ఓ సూచన చేశారు. లాటరీ కోసం డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎంత వరకు ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకుని ఆ పరిమితిని దాటకూడదని చెప్పారు.









