
పశ్చిమాసియాలో క్రమంగా పెరుగుతున్న యుద్ద ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు రవాణాపై తీవ్రస్థాయిలో పడుతోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ఈ సముద్ర మార్గంలో రాకపోకలు సాగిస్తున్న చమురు నౌకలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణ వాణిజ్య నౌకలతో పాటు అత్యంత భారీ పరిమాణంలో చమురును రవాణా చేసే సూపర్ ట్యాంకర్లు కూడా ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింటుండటం గ్లోబల్ మార్కెట్‌ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
పశ్చిమాసియా ఘర్షణల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సూపర్ ట్యాంకర్లలో దాదాపు 3.5 శాతం నౌకలు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటివరకు హర్మూజ్ జలసంధి ప్రాంతంలో దాదాపు 30 ‘వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్లు’ దాడుల బారినపడి దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 900కు పైగా వీఎల్సీసీ నౌకలు అందుబాటులో ఉండగా అందులో 30 నౌకలు దెబ్బతినడం రవాణా వ్యవస్థపై పెను భారంగా మారింది. ఒక్క అక్టోబర్ నెలలోనే 11 సూపర్ ట్యాంకర్లపై దాడులు జరిగాయని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Also Read : నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి.. లూలా డ సిల్వా ఘన విజయం
ఈ సూపర్ ట్యాంకర్లు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక్కో ట్యాంకర్ ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రవాణా ఖర్చులు తగ్గడం, డిస్కౌంట్లు లభించడం వంటి కారణాలతో చమురు సంస్థలు, షిప్పింగ్ యజమానులు ఎక్కువగా ఈ సూపర్ ట్యాంకర్లలోనే ఇంధనాన్ని రవాణా చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్రిక్తతల సమయంలో ఇవే ట్యాంకర్లు ప్రత్యర్థుల దాడులకు ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయని ఐఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక ఈ ఏడాది అక్టోబర్ నెలలో హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై రికార్డు స్థాయిలో విపరీతమైన దాడులు చోటుచేసుకున్నాయి. యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ జలమార్గంలో 130కి పైగా చిన్న, పెద్ద నౌకలు దెబ్బతిన్నాయి. కేవలం అక్టోబర్‌లోనే 28 నౌకలపై దాడులు జరిగినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. అత్యంత దారుణంగా అక్టోబర్ 22న ఒక్కరోజే ఏకంగా ఏడు చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర నిరంతర భయాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.3 శాతం మేర తగ్గి 115.19 డాలర్లకు చేరింది. ఇరాన్‌తో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు, ఒప్పందం కుదుర్చుకునేందుకు దౌత్య మార్గాలను అన్వేషిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లో ఒత్తిడి కాస్త తగ్గి.. ఆయిల్ ధరలు కొద్దిగా దిగొచ్చాయి. అయితే హర్మూజ్ జలసంధిలో శాంతిభద్రతలు ఎప్పుడు కుదుటపడతాయో.. చమురు మంటలు పూర్తిగా ఎప్పుడు చల్లారుతాయో అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.
Also Read : ఇజ్రాయెల్ ఎన్నికల వేళ ఉత్కంఠ.. నెతన్యాహుకు షాక్ తప్పదా? గెలుపు గుర్రం ఏ పార్టీ అంటే?









