Intermediate board:తెలంగాణలో జూనియర్ కాలేజీల అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) తీవ్రంగా ఖండించింది. రూల్స్ పక్కాగా పాటించిన కాలేజీలకే అఫిలియేషన్ ఇస్తున్నామని, స్టూడెంట్స్ సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని బోర్డు స్పష్టం చేసింది. కార్పొరేట్ కాలేజీలకు బోర్డు ఫేవర్‌గా వ్యవహరిస్తోందన్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,241 జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైన డాక్యుమెంటేషన్, క్యాంపస్ మార్పుల వెరిఫికేషన్ పూర్తయ్యాక మరో 12 కాలేజీలకు కూడా అడ్మిషన్ల పర్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్క స్టూడెంట్ కూడా చేరకపోవడంతో 27 కాలేజీలు స్వచ్ఛందంగా ‘జీరో అడ్మిషన్స్’ కోసం దరఖాస్తు చేసుకున్నాయని, ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు లేని కాలేజీలకు నిబంధనల ప్రకారం గుర్తింపు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది.

ఇన్‌స్పెక్షన్స్‌లో 65 జూనియర్ కాలేజీలు ఫేక్ ఫైర్ సేఫ్టీ NOCలు సమర్పించినట్లు తేలడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని బోర్డు హెచ్చరించింది. కార్పొరేట్ కాలేజీలకు కొమ్ముకాస్తున్నామన్న విమర్శలను కొట్టిపారేస్తూ.. రూల్స్ బ్రేక్ చేసిన కార్పొరేట్ కాలేజీలపై జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనే రూ.4 కోట్లకు పైగా జరిమానాలు  విధించినట్లు వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్ తనిఖీలు రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్‌లో భాగమే తప్ప యాజమాన్యాలను వేధించడానికి కాదని స్పష్టం చేసింది.

కాలేజీలు నిబంధనలు పాటించేలా గైడ్ చేయడానికి ఒక ‘హై-లెవల్ కంప్లయన్స్ కమిటీ’ని కూడా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల్లో గుర్తించిన లోపాలను త్వరలోనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పబ్లిక్‌గా ఉంచే ఆలోచన చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఫేక్ న్యూస్, పుకార్లతో బోర్డుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మానుకోవాలని యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చింది. అఫిలియేషన్ ప్రక్రియలో పూర్తి ట్రాన్స్‌పరెన్సీ, స్టూడెంట్స్ భద్రతకే తమ ఫస్ట్ ప్రయారిటీ అని బోర్డు కుండబద్దలు కొట్టింది.