జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టని లోకోపైలట్లు కూడా ఇప్పుడు రైల్వేశాఖ తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం రైల్వే శాఖలో అమలవుతున్న కఠినమైన ‘జీరో ఆల్కహాల్’ పాలసీ. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం రైళ్లు నడిపే లోకోపైలట్ల బ్లడ్‌లో ఆల్కహాల్ శాతం ఖచ్చితంగా సున్నా మాత్రమే ఉండాలి. కానీ, రక్త నమూనా పరీక్షల్లో 10 mg/dL లేదా అంతకంటే ఎక్కువ రీడింగ్ రావడంతో పలువురు పైలట్లు డిసిప్లినరీ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదం తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ చేపట్టిన విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. డ్యూటీలో ఉన్న సిబ్బందికి నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్టుల్లో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, వారి బ్లడ్ శాంపిల్స్ పరీక్షించినప్పుడు మాత్రం ప్రతి 100 మి.లీ. రక్తంలో 3 నుంచి 10 మిల్లీగ్రాముల వరకు ఇథనాల్ ఉన్నట్లు తేలింది.

దీనిపై లోకోపైలట్ల యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆల్కహాల్ తీసుకోని వ్యక్తుల్లో కూడా శరీర సహజ జీవక్రియలు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల రక్తంలో 10 mg/dL వరకు ఇథనాల్ కనిపించే అవకాశం ఉందని సైంటిఫిక్ స్టడీస్ చెబుతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. మద్యం సేవించకపోయినా ఇలాంటి ఫలితాలు రావడం వల్ల నిజాయితీగా పనిచేసే పైలట్లు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సున్నా కన్నా కాస్త ఎక్కువ ఆల్కహాల్ రీడింగ్ వస్తే, వారు రైలు నడపడానికి అర్హులా కాదా అనే విషయంపై రైల్వే బోర్డు ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని PTIకి సీనియర్ అధికారి తెలిపారు. ఈ సమస్య తెరపైకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఫైనల్ డెసిషన్ పెండింగ్‌లోనే ఉందని, బోర్డు తక్షణమే దీనిపై ఒక స్పష్టమైన గైడ్‌లైన్ విడుదల చేయాలని జోనల్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.