Modi: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘చిన్మయ అమృత మహోత్సవ్ గ్లోబల్ సమ్మిట్’ వేదికగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు 33 సంవత్సరాల క్రితం పరమపదించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానందతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా సంభాషించారు. ఆధునిక హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో ఈ అద్భుతం సాధ్యమైంది.

వేదికపై స్వామి చిన్మయానంద 3D రూపంలో ప్రత్యక్షమై మాట్లాడిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ప్రధానికి స్వామివారి ఏఐ అవతారం ఆశీస్సులు అందజేస్తూ, “ఋషులు, మునుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి” అని పేర్కొంది. అంతేకాకుండా, భక్తుల తరఫున ప్రధానికి శ్రీఖండ్ ప్రసాదం అందించాలని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. ఈ దృశ్యాన్ని చూసిన ప్రధాని మోదీ భావోద్వేగానికి గురవుతూ, ఒక్క క్షణం తాను గతంలోకి వెళ్లినట్లు అనిపించిందని వ్యాఖ్యానించారు.

సుమారు 33 సంవత్సరాల క్రితం పరమపదించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానందతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా సంభాషించారు.

హోలోగ్రామ్ అంటే ఏమిటి?

హోలోగ్రామ్ అనేది లైట్ ప్రొజెక్షన్, డిజిటల్ డిస్‌ప్లే ద్వారా ఒక వ్యక్తిని లేదా వస్తువును త్రిమితీయ (3D) రూపంలో మన కళ్ల ముందే ఉన్నట్లుగా సృష్టించే ఆధునిక సాంకేతికత. దీనికి వాయిస్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ సమన్వయం చేసి మాట్లాడేలా చేస్తారు.

ఆధ్యాత్మిక వారసత్వానికి ఏఐ సాంకేతికతను జోడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత్, ఇటు చమురు ధరల తగ్గుదలతో పటిష్టమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.