Sunil Bansal :  తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పదవుల్లో ఉన్న నేతలు క్షేత్రస్థాయిలో పని చేయాలని స్పష్టం చేశారు. కేవలం స్టేట్ ఆఫీస్‌లో కనిపిస్తూ, సమావేశాలకు హాజరవుతూ ఉంటే సరిపోదని తేల్చి చెప్పారు. పార్టీలో పదవులు తీసుకుని పని చేయకుండా ఉంటే వాటి వల్ల ఏం ఉపయోగమని సునీల్ బన్సల్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రతి నాయకుడు తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో కనీసం కొన్నింటినైనా పూర్తి చేయకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదని బన్సల్ నేతలకు స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు తనకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ప్రజలను కలవాలని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేలా పని చేయాలని సూచించారు.

సభల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం కంటే ప్రజలతో నేరుగా మాట్లాడటం ముఖ్యమని బన్సల్ చెప్పారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకోవాలని నేతలకు సూచించారు. ప్రతి నాయకుడు తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. నేతలు తమ నియోజకవర్గాల్లో చేసిన పర్యటనలు, కార్యక్రమాల వివరాలను ప్రతి నెలా పార్టీకి ఇవ్వాలని బన్సల్ సూచించారు. ఎక్కడెక్కడ పర్యటించారు? ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ప్రజలతో ఎలా మమేకమయ్యారు? అనే వివరాలను పార్టీకి తెలియజేయాలని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ నేతలకు కూడా బన్సల్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ముందుగా పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ పదవులు, ఎన్నికల్లో పోటీ రెండింటినీ ఒకేసారి నిర్వహించకుండా.. ముందుగానే నియోజకవర్గాల్లో పని చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. పార్టీపై మరింత ఫోకస్ పెట్టిన సునీల్ బన్సల్.. ఇక నుంచి రాష్ట్రంలోనే ఎక్కువ సమయం ఉంటానని నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే బీజేపీ అధిష్ఠానం సునీల్ బన్సల్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా కొనసాగించింది. ఆయనకు సహాయంగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలంగా తయారు చేయడంపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బన్సల్ నేతలకు ఇచ్చిన సూచనలు బీజేపీలో ఇకపై పని తీరు మారబోతోందన్న సంకేతాలు ఇస్తున్నాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.