Neha Bora :  SIRకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న AISA అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రూ.10 వేల వ్యక్తిగత బాండ్, ఒకరి హామీ ఇవ్వాలని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన నోటీసును ఆమె కోర్టులో సవాల్ చేశారు. అయితే ఆమె పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, నేహా బోరాపై చర్యలకు ఉపయోగించిన అన్ని వివరాలు, ఆధారాలను ఆమెకు ఇవ్వాలని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ను కోర్టు ఆదేశించింది. అలాగే BNSS లోని సెక్షన్ 135ను కూడా మేజిస్ట్రేట్ సరిగ్గా పరిశీలించాలని కోర్టు చెప్పింది. విచారణ మొదలైన వెంటనే బాండ్ ఇవ్వాలని నేహా బోరాను ఆదేశించవచ్చా? లేక విచారణ జరుగుతున్న సమయంలో పరిస్థితిని బట్టి బాండ్ అవసరమా కాదా అనేది నిర్ణయించాలా? అనే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.

BNSSలోని సెక్షన్ 135 ప్రకారం.. శాంతిభద్రతలకు వెంటనే ముప్పు ఉందని భావించిన పరిస్థితుల్లో విచారణ సమయంలో వ్యక్తి నుంచి బాండ్ తీసుకునే అవకాశం ఉంది. నేహా బోరా పిటిషన్‌ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఆమె వేసిన పిటిషన్‌కు చట్టపరంగా సరైన ఆధారం లేదని వాదించారు.

తనపై ఇచ్చిన నోటీసు స్పష్టంగా లేదని, అందులో కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయని నేహా బోరా తరఫు న్యాయవాది అభిక్ చిమ్ని వాదించారు. శాంతిభద్రతలకు తాను ముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పడానికి నోటీసులో సరైన ఆధారాలు చూపలేదని ఆయన అన్నారు. అక్టోబర్ 17న BNSSలోని సెక్షన్ 126 కింద నేహా బోరాకు ఈ నోటీసు ఇచ్చారు. అంతకుముందు అక్టోబర్ 16న ఢిల్లీలో జరిగిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌లో పాల్గొన్నందుకు పోలీసులు ఆమెను ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అయిన SIRలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు.

అక్టోబర్ 19న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరై, విచారణ పూర్తయ్యే వరకు శాంతిభద్రతలు కాపాడతానని రూ.10 వేల బాండ్, ఒకరి హామీ ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో నేహా బోరాను ఆదేశించారు. BNSSలోని సెక్షన్ 126 ప్రకారం.. ఒక వ్యక్తి శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని నమ్మడానికి సరైన కారణాలు ఉంటే, ఆ వ్యక్తి నుంచి శాంతి పాటిస్తానని బాండ్ తీసుకునే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉంటుంది. అక్టోబర్ 16న మండి హౌస్ వద్ద నేహా బోరా నినాదాలు చేశారని పోలీసులు ఆరోపించారు. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పలుమార్లు ఆందోళన చేశారని, ఇతరులను కూడా ఆందోళనలో పాల్గొనాలని ప్రోత్సహించారని పోలీసులు పేర్కొన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.