
Paris : ఫ్రాన్స్‌లోని పారిస్‌కు పశ్చిమాన ఉన్న ట్రాప్ పట్టణంలో శుక్రవారం కాల్పుల ఘటన జరిగింది. ఓ వ్యక్తి వీధుల్లో కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. పోలీసు అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని సమీపంలోని కోయినియర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో ట్రాప్, పక్కనే ఉన్న లా వెరియర్ ప్రాంతాల్లో అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయంపై అధికారులు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య మారే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పారు.
భద్రతా బలగాలు, న్యాయ శాఖకు చెందిన అన్ని వనరులను పూర్తిగా రంగంలోకి దించాం అని ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం కూడా దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరిని లక్ష్యంగా చేసుకోకుండా.. అటుగా వెళ్తున్న వారిపై విచక్షణ లేకుండా కాల్పులు జరిపినట్లు కనిపిస్తోందని ట్రాప్ మేయర్ అలీ రబే బీఎఫ్ఎం టీవీకి తెలిపారు.
ఒక ఆట స్థలంతో పాటు పలు ప్రాంతాల్లో అతడు కాల్పులు జరిపినట్లు మేయర్ చెప్పారు. ఇంతకంటే ఎక్కువ మంది చనిపోకపోవడం అదృష్టమే అని ఆయన అన్నారు. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి ఆఫ్రికా దేశాలకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు మేయర్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు ఉత్తర ఆఫ్రికాకు చెందిన వ్యక్తి అని చెప్పారు.
ఇదిలా ఉంటే, జీవన ఖర్చులు పెరగడాన్ని నిరసిస్తూ ఫ్రాన్స్‌లో శనివారం మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. గత వారం జరిగిన హింసాత్మక ఆందోళనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈసారి అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా బలగాల సంఖ్యను ప్రభుత్వం భారీగా పెంచుతోంది. భద్రతా కారణాలతో పలు ప్రముఖ మ్యూజియంలను కూడా శనివారం మూసివేయనున్నారు.









