Kenya : మానవత్వాన్ని సిగ్గుపడేలా ఓ మారణకాండ కేసులో కీలక తీర్పు వెలువడింది. మతం పేరుతో అమాయక చిన్నారులను పస్తులుంచి ప్రాణాలు తీసిన స్వయం ప్రకటిత పాస్టర్ పాల్ మెకంజీతో పాటు అతడి 30 మంది సహచరులను కెన్యా కోర్టు దోషులుగా తేల్చింది. ప్రపంచ వినాశనం జరగకముందే ఆకలితో ప్రాణాలు వదిలితే నేరుగా స్వర్గానికి చేరుకుంటారని, ఏసుక్రీస్తును కలుసుకోవచ్చని మెకంజీ అమాయక ప్రజలను నమ్మించాడు. ఆయన మాయమాటల వలలో పడి 190 మంది చిన్నారులు, ఒక పెద్ద మనిషి ఆకలికి బలయ్యారు. ఈ కేసులో నిందితులకు నవంబర్ 6న శిక్ష ఖరారు చేయనున్నారు.

Also Read : భార్య తల నరికి దేవుని ఆలయంలో పడేసిన భర్త.. ఆపై తండ్రి హత్య.. కారణం తెలిస్తే షాకే..!

అడవిలో 400కు పైగా శవాలు

క్రైస్తవం ముసుగులో మెకంజీ ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి’ ద్వారా ఒక గ్రూపును నడిపేవాడు. 2019లో స్థానిక అధికారులు చర్చిని మూసివేయడంతో, మెకంజీ తన కేంద్రాన్ని మలిండి సమీపంలోని షాకహోలా అటవీ ప్రాంతానికి మార్చాడు. అక్కడే అనుచరులను బంధించి మూఢ బోధనలు సాగించాడు. ఈ ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో ఇప్పటివరకు ఏకంగా 400కు పైగా మృతదేహాలు బయటపడటం అంతర్జాతీయంగా కలకలం రేపింది.

Also Read : బీహార్‌లో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై 8 మంది అఘాయిత్యం!

పాఠశాలలు, ఆసుపత్రుల్లో దయ్యాలు..

చిన్నారులు బడికి వెళ్లకుండా, అనారోగ్యం బారినపడినవారు ఆసుపత్రులకు వెళ్లకుండా మెకంజీ గట్టిగా అడ్డుకునేవాడు. ఆధునిక విద్య, వైద్య సంస్థలు దయ్యాలతో సంబంధం కలిగి ఉన్నాయని ప్రచారం చేశాడు. మార్చి 2023లో మొదలైన ఈ వివాదంలో తొలుత అతడిని అరెస్ట్ చేసినా బెయిల్‌పై బయటకు వచ్చాడు. 2017 నుంచే అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్నా పోలీసులు, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించలేదనే విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. కోర్టులో మాత్రం తాను ఎవరినీ బలవంతంగా పస్తులు ఉంచలేదని మెకంజీ వాదించినప్పటికీ, కోర్టు అతడి వాదనలను కొట్టివేసి కఠిన నేరస్తుడిగా నిర్ధారించింది.