
Noida : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రబూపురా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతి చెందిన వారిలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాత్రి నూడుల్స్ తిన్న తర్వాతే ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. అయితే, ఐదుగురి మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. మృతి చెందిన వారిని మహేష్ (37), ఆయన భార్య లలిత (35), కుమారులు లడ్డూ (11), సాక్షత్ (3), కుమార్తె మిష్టి (7)గా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య భోజనం చేశారు. ఆ తర్వాత నిద్రపోయారు. శనివారం ఉదయం పరీక్షకు వెళ్లాల్సిన ఒక చిన్నారి నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కుటుంబంలోని మిగతా సభ్యుల పరిస్థితిని పరిశీలించగా, ఐదుగురూ మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం, ఆహార భద్రత శాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్లి పరిశీలించారు. మరణాలకు ఆహారంలో ఏదైనా విషపదార్థం కలవడం కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు పంపించారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర శాస్త్రీయ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై జేవర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ స్పందించారు. ఈ విషాద ఘటన గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, అందులో ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. పోలీసులు, అధికారులు, ఆహార భద్రత శాఖ సిబ్బంది కలిసి విచారణ జరుపుతున్నారని తెలిపారు.
ఆస్తి విషయంలో గొడవలు?
మరోవైపు, మహేష్ కుటుంబంలో ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహేష్ తల్లి ఆస్తిని ఇప్పటికే తన కుమార్తె పేరు మీదకు మార్చినట్లు, ఇంటి నుంచి వెళ్లిపోవాలని మహేష్ కుటుంబానికి చెప్పినట్లు పొరుగువారు తెలిపారు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని వారు పేర్కొన్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ఒక జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ తల్లి నూడుల్స్ వండి వారికి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతే ఈ విషాదం జరిగిందని వారు చెబుతున్నారు. అయితే, ఈ విషయాలన్నీ స్థానికులు చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిలో నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు.
మహేష్ తల్లి ఆస్తిని కుమార్తె పేరు మీదకు మార్చిందని, ఇంట్లో ఉండనివ్వనని చెప్పేదని పొరుగువారు మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రతిరోజూ గొడవలు జరిగేవని కూడా ఆరోపించారు. ఈ ఘటనకు ఆస్తి గొడవలకు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయం కూడా విచారణలో తేలాల్సి ఉంది.









