Liaquat Ali Khan : పాకిస్తాన్ తొలి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య జరిగి నేటితో సరిగ్గా 75 సంవత్సరాలు పూర్తయింది. 1951 అక్టోబర్ 16న రావల్పిండిలోని కంపెనీ బాగ్ (ప్రస్తుత లియాఖత్ బాగ్)లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే రెండు బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన లియాఖత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Also Read : ముంచుకొస్తున్న ప్రమాదం.. కరుగుతున్న ‘డూమ్స్‌డే’ హిమానీనదం!

ఘటనా స్థలంలోనే నిందితుడి హతం

కాల్పులు జరిపిన ఆఫ్ఘన్ షూటర్ సయీద్ అక్బర్‌ను క్షణాల వ్యవధిలోనే పోలీసులు కాల్చి చంపారు. జర్మన్ తయారీ 9mm వాల్థర్ P38 పిస్టల్‌ను ఉపయోగించిన అక్బర్, స్టేజ్ వద్దే CID అధికారులకు కేటాయించిన గ్యాలరీలో కూర్చోవడం తీవ్ర అనుమానాలకు రేపింది. హంతకుడిని సజీవంగా పట్టుకోకుండా వెంటనే ఎందుకు చంపేశారన్నది ఇప్పటి వరకూ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.

కాశ్మీర్ వివాదం కారణమా?

1947–48 భారత్-పాక్ యుద్ధం అనంతరం, 1949 జనవరి 1న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కుదిరిన కాశ్మీర్ కాల్పుల విరమణ ఒప్పందంపై పాక్ సైన్యంలోని కొన్ని వర్గాలు, ముజాహిదీన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హత్యకు కొద్ది నెలల ముందే మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ నేతృత్వంలో లియాఖత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫల సైనిక తిరుగుబాటు కూడా జరిగింది. కాశ్మీర్ అంశంపై ఉన్న అసంతృప్తే ఈ హత్యకు ప్రధాన కారణమనే వాదనలు బలంగా వినిపించాయి.

Also Read : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి!

కుట్ర కోణం

జస్టిస్ మహమ్మద్ మునీర్ కమిషన్ విచారణ జరిపినప్పటికీ స్పష్టమైన ఉద్దేశ్యాన్ని తేల్చలేకపోయింది. అక్బర్ ఒంటరిగానే ఈ చర్యకు పాల్పడ్డాడని స్కాట్లాండ్ యార్డ్ తేల్చినా, లియాఖత్ కుటుంబం సహా అనేకమంది ఆ వాదనను తోసిపుచ్చారు. 2025లో సయీద్ అక్బర్ కుమారుడు ఫరూఖ్ బాబ్రక్జాయ్ ప్రచురించిన పరిశోధన కూడా ఈ హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొంది. తుపాకీ పేల్చింది ఎవరో తెలిసినా, దానికి గల అసలు కారణం, తెరవెనుక ఉన్న శక్తులెవరో నేటికీ చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.