
Thwaites Glacier : పశ్చిమ అంటార్కిటికాలోని థ్వైట్స్ హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) ఊహించిన దానికంటే వేగంగా కరిగిపోతోందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. భూమిపైనే అత్యంత వెడల్పైన ఈ హిమానీనదం కూలిపోతే ప్రళయం సంభవిస్తుందనే ఉద్దేశంతో దీనికి ‘డూమ్స్‌డే’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో 4 శాతం ఈ మంచు పర్వతాలు కరగడం వల్లే జరుగుతోంది.
Also Read : కారు కాదు.. గాల్లోకి లేచే రాకెట్!: ఎలాన్ మస్క్ ‘ఫ్లైయింగ్ కార్’ సరికొత్త అద్భుతం!
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (ఇర్విన్), నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు రూపొందించిన నూతన నమూనా ద్వారా దీని అంతర్భాగంలో జరుగుతున్న ప్రక్రియలు వెలుగులోకి వచ్చాయి. హిమానీనదం ‘గ్రౌండింగ్ లైన్’ (మంచు రాశి సముద్రంపై తేలడం ప్రారంభించే ప్రాంతం) కిందకు వెచ్చని సముద్రపు నీరు నిరంతరం చొచ్చుకుపోతోంది. ఈ వెచ్చటి నీటి ప్రవాహం మంచు అడుగు భాగాన్ని వేగంగా కరిగిస్తోంది. దీనికితోడు హిమానీనదం కింద భూమి వాలుగా ఉండటంతో నీరు మరింత లోపలికి ప్రవహిస్తోంది.
ఈ శతాబ్దం చివరి నాటికి (2100) థ్వైట్స్ కరగడం వల్ల సముద్ర మట్టాలు దాదాపు 1.2 అంగుళాలు పెరుగుతాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది మునుపటి అంచనాల కంటే రెట్టింపు. ప్రస్తుతానికి సముద్రం అడుగున ఉన్న 2 ఎత్తైన రాతి పట్టీలు మంచు వేగంగా సముద్రంలో కలవకుండా కొంతమేర అడ్డుకుంటున్నప్పటికీ, ఈ శతాబ్దం చివరి నాటికి ఈ హిమానీనదం విడిపోయే అవకాశం 60 శాతం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. థ్వైట్స్ హిమానీనదం పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా వినాశకర పరిణామాలు తప్పవు. సముద్ర తీరప్రాంతాలు, నదీ డెల్టాల్లో నివసించే కోట్లాది మంది ప్రజలు శాశ్వత వరదల బారిన పడతారు. భారతదేశంలోని కోల్‌కతాతో పాటు షాంఘై, ఢాకా, బ్యాంకాక్, మనీలా, లండన్, న్యూయార్క్, మయామి, న్యూ ఓర్లీన్స్, టోక్యో వంటి ప్రధాన అంతర్జాతీయ నగరాలు తీవ్ర ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి!









