Gen-Z Protesters : బ్రెజిల్‌లో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అధ్యక్ష ఎన్నికల తరుణంలో వేలాది మంది జెన్-జీ విద్యార్థులు, యువత దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో వీధుల్లోకి వచ్చి భారీ ఆందోళనలు చేపట్టారు. దేశంలో మళ్లీ అత్యంత తీవ్రమైన రైట్ వింగ్ సిద్ధాంతాలు ఉన్న నాయకత్వం అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలకే కాకుండా, పౌరుల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతుందని నిరసనకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ట్రంప్ సంచలన నిర్ణయం.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా లేడీ లాయర్ కేటీ జకారియా!

ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తొలి విడత ఫలితాలు ఈ నిరసనలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఫ్లావియో బోల్సొనారో ఊహించని విధంగా 47 శాతం ఓట్లను సాధించగా.. ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న వామపక్ష నాయకుడు లూలా డా సిల్వా 45 శాతం ఓట్ల వద్దే ఆగిపోయారు. బ్రెజిల్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ అభ్యర్థికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో విజేత ఎవరో తేల్చేందుకు అక్టోబర్ 25న ఇద్దరి మధ్య రెండో విడత పోరు జరగనుంది. తొలి విడతలో ఫ్లావియో బోల్సొనారో ఆధిక్యంలో నిలవడమే దేశంలోని యువతను రోడ్లపైకి తీసుకొచ్చింది.

Also Read : ఇరాన్ మిలిటరీ మనీ రూట్‌పై యుఎస్ అటాక్.. బ్లాక్‌లిస్ట్‌లో ముంబై బిజినెస్‌లు

ఫ్లావియో బోల్సొనారో తండ్రి, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పాలనా కాలంలో దేశంలో విపరీతమైన వివాదాలు రేగాయి. ఆయన ప్రస్తుతం తీవ్రమైన అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు అతని కుమారుడు అయిన ఫ్లావియో గెలిస్తే మళ్లీ దేశంలో నియంతృత్వ పోకడలు పెరుగుతాయని.. స్వేచ్ఛాయుతమైన సమాజం దెబ్బతింటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ ఆందోళనల్లో నాన్న వద్దు.. కొడుకూ వద్దు అనే నినాదాలతో యువత నిరసనలు చేపట్టింది.

బ్రెజిల్ తన సొంత నిర్ణయాలు తీసుకోలేకుండా వేరే దేశాల చేతుల్లోకి వెళ్తుందేమో అని యువత భయపడుతోంది. ముఖ్యంగా ఫ్లావియో బోల్సొనారోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను కనుక గెలిస్తే బ్రెజిల్ కాస్తా అమెరికాకు ఒక చిన్న కాలనీలా మారిపోతుందని ఆందోళనకారులు ఆందోళన చెబుతున్నారు. ఈ క్రమంలోనే బ్రెజిల్‌లో నిరసనలు చేపట్టారు. మన దేశ భవిష్యత్తు, పర్యావరణం, కరెంట్ రంగాల ప్రైవేటీకరణ కాపాడకోవాలని, అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకుంటూ జెన్-జీ అంతా కలిసి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.