Thursday, June 4, 01:07
30.2 C
Hyderabad

పెళ్లయిన కుటుంబ సభ్యురాలే.. కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court
Supreme Court

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న తల్లిదండ్రులు అనుకోకుండా మరణించినప్పుడు.. వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామకాలు విషయంలో వివక్షను తొలగించింది. వివాహం అయినంత మాత్రాన ఒక కుమార్తె తన తల్లిదండ్రుల కుటుంబంతో సంబంధాన్ని కోల్పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహిత కుమార్తెలు కూడా తల్లిదండ్రులకు సమానమైన వారసులేనని.. కాబట్టి కారుణ్య నియామకాల్లో వారు కూడా అర్హులేనని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఒక కుమారుడు పెళ్లి చేసుకున్నా కుటుంబంలోనే కొనసాగుతాడు.. కానీ కుమార్తె పెళ్లి చేసుకుంటే ఆమె ఆ కుటుంబ సభ్యురాలు కాదా? అని కోర్టు నిలదీసింది.

లింగ వివక్ష చూపే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కుటుంబ బాధ్యతలను నిర్వహించడంలో కుమార్తెలు ఏమాత్రం తక్కువ కాదని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు కుమార్తెలే వారిని ఎక్కువగా చూసుకుంటున్నారని, వారి సేవలను, ప్రేమను తక్కువ అంచనా వేయలేమని వ్యాఖ్యానించింది. వివాహం అయిన కారణంగానే ఒక కుమార్తెకు ఉన్న హక్కులను హరించడం అన్యాయమని, ఇది సమాజంలో ఉన్న పాతకాలపు ఆలోచనా ధోరణికి నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కారుణ్య నియామక నిబంధనలలో వివాహిత కుమార్తెలను మినహాయించిన వారు, వెంటనే ఆ నిబంధనలను సవరించాలని కోరింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING :  ఘోరం.. రెండు బస్సులు ఢీ… ఏడుగురు మృతి!

ఇకపై ఉద్యోగ నియామకాలలో లింగ భేదం లేకుండా కేవలం కుటుంబ పరిస్థితులను మరియు అవసరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు మహిళా సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగు. ఇది లక్షలాది మంది వివాహిత కుమార్తెలకు భరోసాను ఇస్తుంది. కుటుంబానికి ఆపద కలిగినప్పుడు ఆదుకోవడానికి కుమారులు మాత్రమే కాదు. కుమార్తెలు కూడా సిద్ధంగా ఉంటారని ఈ తీర్పు నిరూపించింది.