Bihar :  బాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ దృశ్యం 3 సినిమా చూసి.. అందులో చూపించినట్లు పోలీసులను తప్పించుకోవచ్చని అనుకున్నాడు. తండ్రిని చంపేందుకు ఏకంగా 2 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి, నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకవని భావిస్తూ తిరిగి సూరత్‌కు బయలుదేరాడు. కానీ మధ్యలో భార్యకు చేసిన ఒక్క ఫోన్‌కాల్‌ అతడి ప్లాన్‌ మొత్తాన్ని బయటపెట్టింది. ఇంతకు ఏం జరిగింది అంటే.. బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లా దర్వా గ్రామంలో జులై 26 రాత్రి ఈ హత్య జరిగింది. గ్రామానికి చెందిన రఘువీర్‌ సహ్ని (50) ఇంటి బయట నిద్రిస్తుండగా.. ఆయన కుమారుడు శివ్‌ శంకర్‌ (26) గొడ్డలితో పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో రఘువీర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం శివ్‌ శంకర్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

శివ్‌ శంకర్‌ సూరత్‌లో భార్యతో కలిసి ఉంటూ ఉద్యోగం చేసేవాడు. తండ్రితో అతడికి చాలాకాలంగా గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి చెందిన భూమి అమ్మకం విషయంలో కూడా తండ్రి, కొడుకుల మధ్య పలుమార్లు గొడవ జరిగినట్లు చెప్పారు. తండ్రి తనను, తన భార్యను వేధించేవాడని శివ్‌ శంకర్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. హత్యకు ముందు శివ్‌ శంకర్‌ సూరత్‌లోని ఓ థియేటర్‌లో దృశ్యం 3 సినిమా చూశాడు. ఆ సినిమా చూసిన తర్వాత తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. సినిమాలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు టైమ్‌లైన్‌ను మార్చడం, తప్పుడు ఆధారాలు సృష్టించడం వంటి విషయాలను చూపిస్తారు. వాటి ఆధారంగా తాను కూడా పోలీసులకు దొరకకుండా ప్లాన్‌ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

హత్య చేయడానికి ముందు శివ్‌ శంకర్‌ తన మొబైల్‌ ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు. సూరత్‌ నుంచి బయలుదేరి ముందుగా పాట్నా చేరుకున్నాడు. అక్కడి నుంచి హాజీపూర్‌కు వెళ్లాడు. అనంతరం రైలులో పటోరీ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో కొంత దూరం వెళ్లి.. మరో నాలుగు కిలోమీటర్లు నడిచి తన గ్రామానికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక నుంచి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని.. నిద్రిస్తున్న తండ్రిపై దాడి చేశాడు. రఘువీర్‌ తీవ్ర గాయాలతో మృతి చెందారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని అక్కడే వదిలేసి శివ్‌ శంకర్‌ తిరిగి పటోరీ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లాడు.

హత్య తర్వాత కూడా తన ప్లాన్‌ సరిగ్గానే ఉందని శివ్‌ శంకర్‌ భావించాడు. ప్రయాణం మొత్తం ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌లోనే ఉంచాడు. అయితే పటోరీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత చేసిన ఓ చిన్న తప్పు అతడిని పోలీసులకు పట్టించింది. పటోరీలో ఫోన్‌ ఆన్‌ చేసి భార్యకు కాల్‌ చేశాడు. ఆమెతో మాట్లాడిన వెంటనే మళ్లీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు. అయితే అప్పటికే పోలీసులు శివ్‌ శంకర్‌పై అనుమానం పెంచుకున్నారు. ముఖ్యంగా తండ్రి అంత్యక్రియలకు కూడా అతడు హాజరుకాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

టెక్నికల్‌ నిఘాలో అతడి ఫోన్‌ హత్య జరిగిన రోజున పటోరీ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సుమారు 36 గంటలకు అదే ఫోన్‌ సూరత్‌లో కనిపించింది. పటోరీ నుంచి అతడి భార్యకు వెళ్లిన ఫోన్‌కాల్‌ వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. దీంతో పోలీసులు శివ్‌ శంకర్‌ సూరత్‌లో ఉన్న ప్రాంతాన్ని గుర్తించి.. అక్కడే అతడిని అరెస్టు చేశారు.  విచారణలో శివ్‌ శంకర్‌ తండ్రిని చంపేందుకు దృశ్యం 3 సినిమా నుంచి ఆలోచన తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.